కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ 200 యూనిట్లు ఉచిత విద్యుత్ హామీ ఇచ్చింది. ఇప్పుడు అదే పార్టీ అక్కడ మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పరచబోతున్నది. ఈ నేపథ్యంలో గ్రామస్తులు తాము కరెంట్ బిల్లులు కట్టబోమని ప్రజలు తెగేసి చెబుతున్నారు. 

బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది. ఈ ఎన్నికల క్యాంపెయిన్‌లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల కోసం ఇప్పటి నుంచే ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తాము కాంగ్రెస్‌కు ఓటేసిన మరుక్షణం నుంచి తాము ఆ హామీలకు అర్హులవుతామని చెబుతున్నారు. 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ హామీపై కర్ణాటక గ్రామస్తులు కచ్చితత్వంతో ఉన్నారు. ఈ హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాబట్టి, తమను కరెంట్ బిల్లులు అడగొద్దని, తాము ఇవ్వబోమని పవర్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగులకు షాక్ ఇస్తున్నారు.

కర్ణాటకలో మెజార్టీ సాధించిన కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రభుత్వాన్ని ఏర్పాటే చేయలేదు. సీఎం పదవి చుట్టూ ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు జరిగాయి. ఎట్టకేలకు సిద్దరామయ్య సీఎంగా ప్రమాణం చేయ బోతున్నారు. కానీ, రాష్ట్ర ప్రజలు మాత్రం ఆ పార్టీ ఇచ్చిన హామీలు అమల్లోకి రావాల్సిందేనని పట్టుబ డుతున్నారు. కొప్పల్, కాలబురగి, చిత్రదుర్గ జిల్లాల్లో గ్రామస్తులు కరెంట్ బిల్లులు కట్టబోమని స్పష్టం చేస్తున్నారు.

ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ ఉద్యోగులు ఊళ్ల లోకి వెళ్లి మీటర్ రీడింగ్‌లు తీసి బిల్లులు ఇస్తుండగా.. గ్రామస్తుల నుంచి వారికి షాక్ తగిలింది. తాము బిల్లు కట్టేదే లేదని తెగేసి చెప్పారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిన పార్టీనే అధికారంలోకి వచ్చిందని, కాబట్టి, తాము కరెంట్ బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని అన్నారు.

Also Read: Titanic Ship: టైటానిక్ షిప్ శకలాల 3డీ స్కాన్ చిత్రాల వెల్లడి.. మైండ్ బ్లోయింగ్ పిక్స్ ఇవే

చిత్రదుర్గకు చెందిన ఓ మహిళ తాము బిల్లు పే చేయమని స్పష్టంగా చెప్పేసింది. తాము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసిన వెంటనే ఆ పార్టీ ఇచ్చిన హామీకి తాము అర్హులమవుతామని తెలిపింది.

‘మా కరెంట్ బిల్లులు సిద్దరామయ్, డీకే శివ కుమార్‌లను కట్టనివ్వండి. ఎన్నికల తర్వాత 200 యూనిట్లు ఉచిత విద్యుత్ హామీ అమలు చేస్తామని చెప్పారు. కాబట్టి, మీరు ఇక్కడికి రాకండి. మేం కరెంట్ బిల్లు కట్టం. ఒక్కసారి మేం ఓటు కోసం బటన్ ప్రెస్ చేశామా.. ఆ గ్యారంటీకి తాము అర్హుల మవుతాం’ అని ఆ మహిళ పేర్కొంది.

‘మేం కరెంట్ బిల్లు కట్టం. 200 యూనిట్లు ఉచితంగా హామీ ఇచ్చారు. ఇంకా సీఎం లేకున్నా సరే.. బిల్లు కట్టే ప్రసక్తే లేదు’ అని కొప్పల్‌ కు చెందిన మరో వ్యక్తి అన్నారు.