మహారాష్ట్రలో కొండచరియలు విరిగిపడిన ఘటన.. రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేత.. ఇంకా లభించని 57 మంది ఆచూకీ!
మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలోని ఇర్షాల్‌వాడిలో కొండచరియలు విరిగిపడిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఘటన స్థలంలో నాలుగు రోజుల పాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్‌ఎఫ్) ఆదివారం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌ను ముగించింది.

మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలోని ఇర్షాల్‌వాడిలో కొండచరియలు విరిగిపడిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఘటన స్థలంలో నాలుగు రోజుల పాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్‌ఎఫ్) ఆదివారం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌ను ముగించింది. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మహారాష్ట్ర మంత్రి ఉదయ్ సమంత్ మీడియా సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. జిల్లా యంత్రాంగం, సంబంధిత అధికారులు మరియు స్థానిక నివాసితులతో సంప్రదింపుల తర్వాత ఆపరేషన్ ముగింపు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు.
ఇప్పటివరకు 27 మృతదేహాలను స్వాధీనం చేసుకోగా.. 57 మంది జాడ తెలియలేదని చెప్పారు. మరణించినవారిలో 12 మంది పురుషులు, 10 మంది మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారని తెలిపారు. ఒక మృతదేహాన్ని ఇంకా గుర్తించలేదని చెప్పారు. ఘటన స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన సిబ్బంది.. శనివారం వరకు 27 మృతదేహాలను వెలికితీశారని, ఆదివారం చేపట్టిన ఆపరేషన్‌లో శిథిలాల నుంచి ఒక్క మృతదేహం కూడా కనుగొనబడలేదని చెప్పారు. శనివారం చివరిగా లభించిన మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉందని వెల్లడించారు.
ఇక, ఇర్షాల్‌వాడిలో జులై 19 రాత్రి 10:30 గంటల ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటం 48 ఇళ్లలో కనీసం 17 పూర్తిగా లేదా పాక్షికంగా సమాధి అయ్యాయి. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్), ఇతర ఏజెన్సీలు ఘటన స్థలంలో శోధన, రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాయి.