Holi Celebration: కరోనావైరస్ సంక్రమణ వ్యాప్తి చెందకుండా చూసుకోవడానికి ధూళివందన్ మరియు రంగపంచమిని (Holi Celebrations) సాధారణ పద్ధతిలో జరుపుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సూచించింది.
Holi Celebration: యావత్ భారతావని ఘనంగా హోలీ వేడుకలను జరుపుకోవడానికి సిద్ధమైంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో రంగులకేళీ షురూ అయింది. అయితే, ప్రస్తుతం పలు దేశాల్లో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. మన దేశంలో కరోనా ప్రభావం గణనీయంగా తగ్గినప్పటికీ.. ముందస్తు చర్యల్లో భాగంగా హోలీ వేడుకల కారణంగా కరోనా వ్యాప్తి మళ్లీ పెరగకుండా మహారాష్ట్ర అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఈ క్రమంలోనే హోలీ వేడుకలు జరుపుకోవడానికి మార్గదర్శకాలు విడుదల చేసింది.
మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం హోలీ వేడుకలు జరుపుకోవడానికి సంబంధించి ప్రజలకు పలు సూచనలు చేస్తూ.. మార్గదర్శకాలను జారీ చేసింది. కరోనా వైరస్ మహమ్మారి ఇప్పటికీ ప్రబలంగా ఉన్నందున COVID-సముచిత ప్రవర్తనను గమనించి పెద్ద ఎత్తున గుమిగూడకుండా రంగుల పండుగను జరుపుకోవాలని ప్రజలను ప్రభుత్వం కోరింది. తాజా మార్గదర్శకాలలో కరోనావైరస్ సంక్రమణ వ్యాప్తి చెందకుండా చూసుకోవడానికి ధూళివందన్ మరియు రంగపంచమిని సాధారణ పద్ధతిలో జరుపుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సూచించింది.
పండుగ సందర్భంగా ఇంటింటికి 'పాల్కి' (పల్లకి) ఊరేగింపులను తీసుకువెళ్లవద్దని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను కోరింది. స్థానిక ఆలయంలో దర్శనం (పాల్కీ) కోసం స్థానిక పరిపాలన ఏర్పాట్లు చేయాలని పేర్కొన్న మహారాష్ట్ర సర్కారు.. స్థానిక పరిపాలన కూడా COVID-19 సముచిత ప్రవర్తనను సమర్థవంతంగా పాటించేలా చూడాలని పేర్కొంది. కాగా, దేశంలో కరోనా ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటిగా కొనసాగింది. ఇతర రాష్ట్రాల్లో కంటే మహారాష్ట్రలోనే అత్యధికంగా కరోనా మహమ్మారి కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ కారణంగా గత రెండేళ్లుగా రాష్ట్రంలో అన్ని పండుగలను తక్కువ స్థాయిలో జరుపుకుంటున్నారు.
కాగా, మహారాష్ట్రలో హోలీ వేడుకలు వారం రోజుల పాటు కొనసాగుతాయి. ఇక్కక హోలీని షింగా వలె సెలబ్రేట్ చేసుకుంటారు. అక్కడి యువకులంతా హోలీకి ముందు రోజు కట్టెలను అందరి ఇంటికి తీసుకెళ్లి డబ్బులను పోగేస్తారు. ఇకహోలీ రోజున ఆ కట్టెలనంతా ఒక పెద్ద కుప్పగా వేసి.. సాయంత్రం పూట మంట వెలిగిస్తారు. తిను బండాలను, భోజనాన్ని సమర్పించడం ఇక్కడి ఆచారం. ఈ సంవత్సరం 'హోలికా దహన్' గురువారం జరుపుకుంటున్నారు. ఆ తర్వాత 'ధూలివందన్' మరియు 'రంగపంచమిని ప్రజలు పరుపుకుంటారు. ప్రజలు ఒకరికొకరు రంగులు జల్లుకుంటారు.
మహారాష్ట్రాలోని గడ్చిరోలి ప్రాంతంలో సాంప్రదాయబద్దంగా అక్కడి ప్రజలు హోలీ వేడుకలు జరుపుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
