దేశంలో నానాటికీ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను అదుపులో వుంచాలనే ఉద్దేశ్యంతో వీటిపై కేంద్ర ప్రభుత్వం శనివారం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్రం బాటలో మహారాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించింది. 

దేశంలో సామాన్యులపై భారం తగ్గించేలా పెట్రోల్, డీజిల్‌పై (petrol and diesel prices) ఎక్సైజ్ డ్యూటీ (excise duty) తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం (union govt) శనివారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా లీటర్ పెట్రోల్‌పై రూ. 8, డీజిల్‌పై రూ. 6 ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తూ కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman ) ప్రకటించారు. తాజా తగ్గింపుతో లీటర్ పెట్రోల్ పై రూ. 9.50, డీజిల్ పై రూ. 7 ధర తగ్గింది. అయితే.. తమ వంతుగా ప్రజలపై భారం పడకుండా, ప్రభుత్వానికి నష్టం వస్తున్నా సరే..ఈ సుంకాన్ని తగ్గించామని, ఇక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వంతుగా వ్యాట్ తగ్గించాలని కేంద్రం సూచించింది. అయితే కేంద్ర ప్రభుత్వ సూచనను కొన్ని రాష్ట్రాలు పట్టించుకోలేదు. అయితే మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం (maha vikas aghadi) మాత్రం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో లీటరు పెట్రోల్‌పై రూ.2.08, డీజిల్‌పై రూ.1.44 వ్యాట్ తగ్గిస్తూ ఉద్ధవ్ థాక్రే సర్కార్ (uddhav thackeray) నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ నిర్ణయం కారణంగా పెట్రోల్‌పై రూ. 80 కోట్లు, డీజిల్‌పై రూ. 125 కోట్లు రాష్ట్ర ఖజానాకు నష్టం కలుగుతుంది. మొత్తంగా ఏడాదికి రూ. 2500 కోట్లు భారాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. మరోవైపు .. పెట్రోల్ డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడంపై సీఎం ఉద్ధవ్ థాకరే విమర్శలు గుప్పించారు. ఈ తగ్గింపు సరిపోదని, ప్రజలపై భారం తగ్గించి నిత్యావసరాల ధరలు తగ్గాలంటే పెట్రోల్, డీజిల్‌పై మరింత సుంకాన్ని తగ్గించాలని సీఎం కేంద్రాన్ని కోరారు. 

Also Read:వాహనదారులకు కేంద్రం శుభవార్త : పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు.. దిగిరానున్న ధరలు

మరోవైపు... మోడీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌లపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన నేపథ్యంలోనే కేంద్ర మంత్రులు రాష్ట్రాలపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రేట్లు తగ్గించాలని ట్వీట్లు చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ వెంటనే స్పందిస్తూ లెక్కలు చేసింది. ప్రజలను పిచ్చోళ్లు చేయొద్దని కేంద్రంపై విమర్శలు సంధించింది.

కేంద్ర మంత్రి హర్దిప్ సింగ్ పురి బీజేపీయేతర రాష్ట్రాలపై విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం రెండు సార్లు పెద్ద మొత్తంలో ధరలు తగ్గించినా.. బీజేపీయేతర రాష్ట్రాలు అదే విధంగా తగ్గింపునకు సహకరించడం లేవని ఆరోపించారు. ఇప్పటికీ బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోలిస్తే.. ఆ రాష్ట్రాల్లో చమురు ధరలు రూ. 10 నుంచి రూ. 15 వరకు ఎక్కువగానే ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌లకు కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్ సింగ్ సుర్జేవాలా స్పందించారు.