ఉద్థవ్‌ను ఎమ్మెల్సీగా నియమించండి: గవర్నర్‌ను కోరిన మహారాష్ట్ర ప్రభుత్వం
ఓ పక్క కరోనాను కంట్రోల్ చేయడానికి అపసోపాలు పడుతున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్థవ్ థాక్రేకు మరో ఇబ్బంది ఎదురైంది.
గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి అధికార పగ్గాలు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సంకీర్ణ కూటమి తరపున ఉద్థవ్ థాక్రే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు.
అయితే ఆ సమయంలో ఆయన ఏ సభలోనూ సభ్యుడు కాదు. రాజ్యాంగంలోని నిబంధనలను అనుసరించి ఏ సభలోనూ సభ్యుడు కానీ వ్యక్తి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే.. ఆరు నెలల లోపు ఉభయ సభల్లో ఏదో ఒక సభకు ఎన్నికవ్వాల్సి ఉంటుంది. లేని పక్షంలో పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.
Also Read:ముంబైలో మాస్క్ తప్పనిసరి: హద్దు మీరితే జైలుకే.. ఉద్ధవ్ కఠిన చర్యలు
అయితే కరోనా వైరస్ కారణంగా మహారాష్ట్రలో జరగాల్సిన శాసనమండలి ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇదే సమయంలో ఉద్ధవ్‌కు గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఆయనను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ను కోరింది.
ఈ మేరకు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలో జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ఓ తీర్మానాన్ని ఆమోదించారు. కాగా మహారాష్ట్రలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,100 దాటింది.
Also Read:శ్రీమతి మాట విని ఇంట్లోనే ఉన్నా. మీరంతా కూడా..: ఉద్ధవ్ థాకరే
బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతుండటంతో ముంబైలో ప్రజలు మాస్క్ ధరిస్తేనే రోడ్ల మీదకు రావాలని ఆదేశించింది నగర పాలక సంస్థ. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన వారిని జైలుకు పంపుతామని హెచ్చరించింది.