మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ బీజేపీని ఆహ్వానించారు. అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీగా అవతరించడంతో గవర్నర్‌ బీజేపీకి అవకాశమిచ్చారు. ఇదే సమయంలో సోమవారం నాడు మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా సూచించారు.

అయితే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 145 మాత్రం కమలనాథులకు లేదు.  గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ- శివసేన కలిసి పోటీ చేశాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి పీఠాన్ని చెరి సగం పంచుకోవాలని శివసేన కోరడంతో ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ గడువు శనివారంతో ముగియనుండటంతో పాటు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన చర్చలు కొలిక్కిరాకపోవడంతో ఫడ్నవీస్ రాజీనామా చేశారు. శుక్రవారం రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆయన గవర్నర్‌ భగత్‌సింగ్ కొషియారీని కలిసి రాజీనామా లేఖను అందించారు.

Also Read:కొలిక్కిరాని చర్చలు: మహారాష్ట్ర సీఎం పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మాట్లాడేందేకు ప్రయత్నిస్తే శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే స్పందించలేదన్నారు. శివసేన మమ్మల్ని కాకుండా కాంగ్రెస్, ఎన్సీపీలను వెళ్లి కలిసిందని ఫడ్నవీస్ మండిపడ్డారు.

ప్రధాని నరేంద్రమోడీపై శివసేన చేసిన వ్యాఖ్యలు సరికావని.. ఆ పార్టీ నేతలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ఫడ్నవీస్ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి పదవిపై అసలు శివసేనతో చర్చలే జరగలేదన్నారు. అపద్ధర్మ సీఎంగా ఉండాలని గవర్నర్ కోరారని.. ప్రభుత్వ ఏర్పాటు బీజేపీతోనే జరుగుతుందని ఫడ్నవీస్ స్పష్టం చేశారు. 

ముఖ్యమంత్రి పదవిని రొటేషన్ పద్ధతిలో పంచుకుందామనే తమ ప్రతిపాదనకు ఫడ్నవీస్ అంగీకరించకపోవడంపై శివసేన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. మోహన్ భగవత్ ను ఫడ్నవీస్ మంగళవారం రాత్రి కలిశారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో ముఖ్యమంత్రి మార్పుకు సంబంధించిన పరిణామాలు వేగవంతమైనట్లు తెలుస్తోంది.

అధికారాన్ని ఫిఫ్టీ-ఫిఫ్టీ పంచుకోవాలనే దానిపై బీజేపీ-శివసేన మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో ప్రభుత్వ ఏర్పాటు వ్యవహారం ఇంకా ఓ కొలిక్కిరాలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also read:రాష్ట్ర రాజకీయాల్లోకి రాను.. మోహన్‌ భగవత్‌తో లింక్ పెట్టొద్దు: నితిన్ గడ్కరీ

శివసేనతో తమ పార్టీ కలిసే ప్రసక్తే లేదని.. కాంగ్రెస్‌తో కలిసి ప్రతిపక్షంలోనే కూర్చుంటామని పవార్ స్పష్టం చేశారు. బీజేపీతో చర్చలు జరుపుకుని శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.