GN SaiBaba: సుప్రీంకోర్టును ఆశ్రయించిన మహారాష్ట్ర ప్రభుత్వం
మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే కేసులో ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా, మరో ఐదుగురిని బాంబే హైకోర్టు నిర్దోషులుగా తేల్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను నిషేధిత సీపీఐ(మావోయిస్టు)లతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణల కేసులో బాంబే హైకోర్టు నిర్దోషిగా తేల్చింది. బాంబే హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
సాయిబాబాపై ఆరోపణలను ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ పేర్కొంది. 90 శాతం అంగవైకల్యంతో బాధపడుతున్న 54 ఏళ్ల సాయిబాబా, మరో ఐదుగురు నిందితులను ఈ కేసులో నిర్దోషులుగా తేల్చింది. వారికి విధించిన యావజ్జీవ కారాగార శిక్షను కూడా తోసిపుచ్చింది. నిందితులపై ఆరోపణలను నిస్సందేహంగా నిరూపించలేకపోయిందని డివిజన్ బెంచ్ న్యాయమూర్తులు వినయ్ జోషి, వాల్మికీ ఎస్ఏ మెనెజీస్ పేర్కొన్నారు.
సాయిబాబాను ఈ కేసులో 2014లో అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆయన నాగపూర్‌లోని సెంట్రల్ జైలులోనే ఉన్నారు. 2017 మార్చిలో గడ్చిరోలి జిల్లా సెషన్స్ కోర్టు సాయిబాబాతోపాటు మరో ఐదుగురికి(ఒకరు జర్నలిస్టు, ఒకరు జేఎన్ యూ స్టూడెంట్) మావోయిస్టులతో లింక్‌లు ఉన్నాయని , దేశానికి వ్యతిరేకంగా యుద్ధానికి ప్రయత్నిస్తున్నారని దోషులుగా తేల్చింది. ఉపా సహా పలు ఐపీసీ సెక్షన్ల కింద ట్రయల్ కోర్టు వీరిని దోషులుగా పేర్కొంది.
Also Read: వ్యర్థాల నుంచి బంగారం తీసిన శాస్త్రవేత్తలు.. ఒక్క రూపాయి పెట్టుబడికి రూ. 50 లాభం!
2022 అక్టోబర్ 14వ తేదీన హైకోర్టు సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించింది. ఉపా కింద సరైన అభియోగాలు లేవని, ఈ ట్రయల్‌ను శూన్యంగా తోసిపుచ్చింది. కాగా, మహారాష్ట్ర అదే రోజు సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. తొలుత ఆదేశాలపై స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు 2023 ఏప్రిల్‌లో తోసిపుచ్చింది. మళ్లీ ఫ్రెష్‌గా విచారించాలని ఆదేశించింది.