ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో ఏర్పడిన స్తంభనపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ చాలా జాగ్రత్తగా స్పందించారు. రాజకీయ నాయకులు వివేకంతో వ్యవహరించాలని ఆమె అన్నారు. 

ప్రభుత్వ ఏర్పాటులో జరుగుతున్న జాప్యంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, ఆమె ఆచితూచి స్పందించారు. సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని, స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటుకు ఎటు వైపు నిలబడలానే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రాకీయ నాయకులు సరైన నిర్ణయం తీసుకోవాలని ఆమె అన్నారు. 

అమృత ఫడ్నవీస్ యాక్సిస్ బ్యాంకులో సీనియర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. అక్టోబర్ 24వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడి బిజెపి - శివసేన కూటమికి పూర్తి మెజారిటీ లభించింది. అయితే, ముఖ్యమంత్రి పదవి తమకే కావాలని శివసేన పట్టుబడుతుండడంతో ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరుగుతోంది. 

ఇదిలావుంటే, సోమవారంనాడు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ కానున్నారు. మహారాష్ట్రలో బిజెపి, శివసేన మధ్య తగువు కారణంగా ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన ఏర్పడిన నేపథ్యంలో ఆ భేటీకి ప్రాధాన్యం చేకూరింది. 

సోనియా గాంధీతో మాట్లాడాల్సిందిగా శివసేన ముఖ్య నేతలు పవార్ తో చెప్పినట్లు తెలుస్తోంది. దేశ ఆర్థిక పరిస్థితిపై పవార్ సోనియాతో మాట్లాడుతారని అంటున్నారు. కానీ మహారాష్ట్ర రాజకీయాలపైనే ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వీలు కలిగేలా చూడాలని కాంగ్రెసు రాజ్యసభ ఎంపీ హుస్సేన్ దల్వాయి ఒకరు సోనియా గాంధీని కోరుతూ లేఖ రాశారు. ఈ నేపథ్యంలోనే సోనియాతో పవార్ భేటీ అవుతున్నట్లు తెలుస్తోంది. 

కాంగ్రెసు, ఎన్సీపీలు శివసేన ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని కాంగ్రెసు మద్దతుదారుల్లోని కొన్ని వర్గాలు అంటున్నాయని, ఆ వర్గాల్లో మైనారిటీ కమ్యూనిటీకి చెందినవారు కూడా ఉన్నారని హుస్సేన్ దాల్వాయి సోనియాకు రాసిన లేఖలో అన్నారు. 

బిజెపిపై తెంపు లేకుండా విరుచుకుపడుతున్న శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ గురువారంనాడు ముంబైలో పవార్ ను కలిశారు. దీపావళి సందర్భంగా మర్యాదపూర్వకంగానే పవార్ ను కలిసినట్లు రౌత్ చెప్పారు శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే అవసరమైన సంఖ్యా బలం తమకు లభిస్తుందని కూడా ఆయన అన్నారు. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే పవార్ తో శుక్రవారం ఫోన్ లో మాట్లాడారు. అయితే, అటువంటిదేమీ జరగలేదని ఎన్సీపీ అన్నది. 

శాసనసభ ఎన్నికల్లో బిజెపి, శివసేన కూటమి 161 స్థానాలు గెలుచుకుని అతి పెద్ద కూటమిగా అవతరించింది.  మొత్తం స్థానాలు 288. అయితే, బిజెపి  105 స్థానాలను గెలుచుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మ్యాజిక్ ఫిగర్ దాటాలంటే 56 మంది శివసేన ఎమ్మెల్యేల మద్దతు అవసరం. మంత్రి పదవులు సగం సగం పంచుకోవడమే కాకుండా ప్రభుత్వాన్ని కూడా రోటేషన్ పద్దతిలో రెండు పార్టీలు పంచుకోవాలని డిమాండ్ చేస్తోంది. 

ఎన్సీపీ 54 స్థానాలను గెలుచుకోగా, కాంగ్రెసు 44 స్థానాలను గెలుచుకుంది. శివసేనతో కాంగ్రెసు, ఎన్సీపీ కలిస్తే 154 మంది సభ్యులు అవుతారు. అది జరిగితే బిజెపి మైనారిటీలో పడిపోతుంది. అయితే, 24 మంది శివసేన ఎమ్మెల్యేలు తమ వైపు రావడానికి సిద్ధంగా ఉన్నారని బిజెపి అంటోంది. 

అయితే, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఏర్పడే ప్రమాదం ఉందని బిజెపి హెచ్చరించింది. దీంతో శివసేన, బిజెపి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఏర్పడే అవకాశం ఉందని బిజెపి నేత సుధీర్ ముగంటివార్ చేసిన ప్రకటనపై శివసేన తీవ్రంగా మండిపడింది. రాష్ట్రపతి మీ పాకెట్లో ఉన్నాడా అని శివసేన మండిపడింది. శాసనసభ కాల పరిమితి  ఈ నెల 8వ తేదీతో ముగుస్తుంది.