ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు మలుపు తిరుగబోతున్నాయా అనే ప్రశ్న ఉదయిస్తోంది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో శివసేన పార్లమెంటు సభ్యుడు సంజయ్ రౌత్ భేటీ కావడంతో ఆ ప్రశ్న ముందుకు వచ్చింది వారిద్దరి మధ్య భేటీ దాదాపు రెండు గంటల పాటు జరిగింది.

శివసేన ఎన్సీపీ, కాంగ్రెసు పార్టీలతో కలిసి అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. బిజెపి ప్రతిపక్షంలో కొనసాగుతోంది. ఈ పరిస్థితిలో ఫడ్నవీస్ తో సంజయ్ భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. మహారాష్ట్ర రాజకీయాల్లో భారీ పరిణామం చోటు చేసుకుంటుందనే ఉహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే, వారిద్దరి మధ్య జరిగిన భేటీకి రాజకీయాలతో సంబంధం లేదని బిజెపి మహారాష్ట్ర అధికార ప్రతినిధి కేశవ్ ఉపాధ్యాయ అన్నారు. 

సంజయ్ రౌత్ శివసేన అధికారిక పత్రిక సామ్నా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ స్థాయిలో ఇంటర్వ్యూ చేయడానికి సంజయ్ రౌత్ ఫడ్నవీస్ ను కలిశారని ఆయన ట్వీట్ చేశారు.  తన ఇంటర్వ్యూను సామ్నాలో ఎడిట్ చేయకుండా ప్రచురించాలని ఫడ్నవీస్ సంజయ్ రౌత్ తో చెప్పినట్లు ఆయన తెలిపారు. 

ఇంటర్వ్యూ ఎలా ఉండాలనే విషయంపై ఫడ్నవీస్ కసరత్తు చేస్తున్నారని ఆయన చెప్పారు. నవంబర్ లో బీహార్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఫడ్నవీస్ తో ఇంటర్వ్యూ కోసం సంజయ్ రౌత్ కలుస్తారని ఆయన చెప్పారు. ఫడ్నవీస్ బీహార్ ఎన్నికల్లో బిజెపి ఇంచార్జీగా పనిచేస్తున్నారు.

బిజెపితో తెగదెంపులు చేసుకున్న తర్వాత సంజయ్ రౌత్ ఆ పార్టీపై తీవ్రమైన విమర్శలు చేస్తూ వచ్చారు. రామమందర్, మెట్రో కారు షెడ్, ఎన్ఆర్సీ, సీఏఏ, వ్యవసాయ బిల్లులు, కోవిడ్ 19 నియంత్రణ, సుశాంత్ సింగ్ మృతి కేసు దర్యాప్తు, కంగనా రనౌత్ మీద ముంబై పోలీసుల దాడుల వంటివాటి విషయాల్లో బిజెపిపై సంజయ్ రౌత్ తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. 

అదే సమయంలో ప్రతిపక్ష నేత ఫడ్నవీస్ వ్యవహరిస్తున్న తీరును ఆయన ప్రశంసించారు కూడా. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రభుత్వంపై ఫడ్నవీస్ ఎప్పటికప్పుడు ఘాటైన విమర్శలు చేస్తూనే ఉన్నారు.