బంధువుల వేధింపులు తాళలేక జంట తమ జీవితంపై దారుణమైన నిర్ణయం తీసుకుంది. తాము అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బిడ్డను తమ చేతులతో తామే చంపేశారు. ఆ తర్వాత ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ లో సూసైడ్ నోట్ పంపి... దంపతులు ఇద్దరూ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ దారుణ సంఘటన మహారాష్ట్ర లోని థానేలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. థానేకి చెందిన శివరామ్ పాటిల్(44) ఓ రైస్ మిల్లులో పనిచేస్తున్నాడు. అతనికి భార్య దీపిక(42), నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు. కాగా... గత కొంతకాలంగా వీరిని బంధువులు వేధిస్తున్నారు.

వారి వేధింపులు రోజు రోజుకీ ఎక్కువ కావడంతో.. ఈ దారుణానికి ఒడి గట్టారు. తమ చావుకు కారణం వీరే అంటూ తమ బంధువుల్లోని 13మంది పేర్లను సూసైడ్ నోట్ లో పొందరుపరిచారు. వారందరిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు ఆ లేఖలో పేర్కొనడం గమనార్హం.

Also Read చేతిలో పసిబిడ్డతో సీఎం సభకు హాజరైన మహిళా పోలీస్.. ఫోటో వైరల్...

తమ పేరు మీద ఉన్న ఆస్తిని తన భార్య దీపిక సోదరుడికి అప్పగించాలని పేర్కొన్నారు. ఇక తమ అవయవాలను దానం చేయాలని.. ఆ బాధ్యత కూడా తన బావమరిదికే అప్పగిస్తున్నట్లు అందులో పేర్కొన్నాడు. 

కాగా ఆ సూసైడ్ నోట్ మార్చి 1వ తేదీన వారు వాట్సాప్ గ్రూప్ లో పెట్టారు. దానిని కాస్త ఆలస్యంగా చూసిన ఓ బంధువు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. అయితే... పోలీసులు అక్కడికి వెళ్లేసరికి ముగ్గురు ప్రాణాలు కోల్పోయి విగతజీవులుగా మిగిలి ఉన్నారు.

ముందు వారి నాలుగేళ్ల కుమార్తెను సీలింగ్ ఫ్యాన్ కి ఉరివేసి చంపేసి.. అనంతరం భార్యభర్తలు ఇద్దరూ ఉరి వేసుకున్నారని పోలీసులు చెబుతున్నారు. సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.