మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే శాసనమండలి సభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు మరో 8 మంది సభ్యులు కూడా ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు గురువారం అధికారిక ప్రకటన వెలువడింది.

మహారాష్ట్ర విధానమండలిలో ఖాళీగా ఉన్న తొమ్మిది మంది ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ ఎన్నికలు నిర్వహించింది. ఇందులో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల నుంచి ఐదుగురు, బీజేపీ నుంచి నలుగురు పోటీలో నిలిచారు.

Also Read:మహారాష్ట్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు: నామినేషన్ దాఖలు చేసిన ఉద్ధవ్ ఠాక్రే

ఉన్న స్థానాలకు సరిగ్గా తొమ్మిది మంది బరిలో నిలవడంతో పాటు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో వీరిందరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.

కాగా.. గతేడాది మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లభించకపోడంతో కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ కూటమి తరపున నవంబర్ 28న శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

Also Read:మహారాష్ట్రలో వెయ్యి మంది పోలీసులకు కరోనా

అయితే ఆయన రెండు సభల్లో ఎందులోనూ సభ్యుడు కాకపోవడంతో సీఎంగా కొనసాగాలంటే మే 27 లోగా ఎమ్మెల్యేగా గానీ, ఎమ్మెల్సీగా కానీ గెలుపొందాలి. ఈ నేపథ్యంలో శాసనమండలికి జరిగిన ఉప ఎన్నికల్లో ఎలాంటి పోటీ లేకుండా ఉద్ధవ్ గెలిచి తన పదవికి ముప్పు లేకుండా చేసుకున్నారు.