మహాకుంభం 2025 ఉత్తరప్రదేశ్ జిడిపిలో ఒక శాతం పెరుగుదలకు, జిఎస్టి వసూళ్లలో పెరుగుదలకు దారితీస్తుందని భావిస్తున్నారు.  

ప్రయాగరాజ్ : తీర్థరాజ్ ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహాకుంభం 2025 సాంస్కృతిక, సామాజికంగానే కాకుండా ఆర్థిక పునరుత్తేజం దిశగా కూడా కీలకం కానుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవలే దీని గురించి మాట్లాడుతూ, మహాకుంభం ద్వారా రెండు లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అన్నారు. ఇక ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం 45 రోజుల పాటు జరిగే ఈ మహా కార్యక్రమం ఉత్తరప్రదేశ్ జిడిపిలో ఒక శాతం లేదా అంతకంటే ఎక్కువ పెరుగుదలకు దారితీయవచ్చట.. అంతేకాదు జిఎస్టి వసూళ్లలో కూడా భారీ పెరుగుదల ఉంటుందంటున్నారు.

ప్రపంచవ్యాప్తంగా వచ్చే భక్తుల ఖర్చుల వల్ల డిమాండ్ పెరుగుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది, ఉపాధి పెరుగుతుంది... చిన్న, పెద్ద వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది. అంతేకాదు ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి కూడా భారీ ఆదాయం వస్తుంది, దీన్ని రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉపయోగించవచ్చు. మొత్తం మీద ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాకారం చేసే దిశగా సాగుతోంది.

ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు

ప్రముఖ సిఎ, ఆర్థిక శాస్త్రవేత్త పంకజ్ గాంధీ జైస్వాల్ ప్రకారం... ఈసారి మహాకుంభం గురించి ప్రభుత్వం చెబుతున్న గణాంకాలు చూస్తుంటే నామినల్, రియల్ జిడిపి రెండింటిలోనూ ఒక శాతం వరకు పెరుగుదల ఉండవచ్చు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకారం దేశవిదేశాల నుండి దాదాపు 45 కోట్ల మంది ఈ మహాకుంభానికి వస్తారు... వారు కాశీ, అయోధ్య, చిత్రకూట్ వంటి అనేక ప్రాంతాలను సందర్శిస్తారు. వారి ఇంటి నుండి కుంభమేళా వరకు... తిరిగి ఇంటికి వెళ్లే వరకు ఒక్కొక్కరి సగటు ఖర్చు దాదాపు 10 వేల రూపాయలు ఉండవచ్చు. 45 కోట్ల మంది ఖర్చును లెక్కిస్తే అది దాదాపు నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు అవుతుంది. దీన్ని పది శాతం తీసేసినా నాలుగు లక్షల కోట్లుగా అంచనా వేసినా, ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిచ్చేందుకు ఇది అద్భుతమైన సంఖ్య. కుంభమేళా ఆర్థిక వ్యవస్థ త్రైమాసిక గణాంకాలను మాత్రమే కాకుండా, దేశ వార్షిక జాతీయ జిడిపిని కూడా బలోపేతం చేస్తుంది.

ప్రభుత్వానికి పెట్టుబడిపై అధిక రాబడి

పంకజ్ గాంధీ జైస్వాల్ ప్రకారం, ఈ మహాకుంభంలో ప్రభుత్వం పెట్టిన పెట్టుబడిపై అధిక రాబడి వస్తుంది. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం మహాకుంభం నిర్వహణకు దాదాపు పదహారు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. దీన్ని ఆధారంగా తీసుకుంటే ప్రభుత్వ ఆదాయం చాలా రెట్లు పెరుగుతుంది. నాలుగు లక్షల కోట్లపై సగటు జిఎస్టి వసూళ్లు దాదాపు 50 వేల కోట్లకు దగ్గరగా ఉంటాయి. ఈ ఖర్చుపై ప్రజలకు వచ్చే ఆదాయంపై పన్ను, ఇతర పరోక్ష పన్నులు కలిపితే ఈ సంఖ్య ఒక లక్ష కోట్లకు చేరుకుంటుంది, అంటే ప్రభుత్వానికే అధిక ఆదాయం వస్తుంది. ఈ విశ్లేషణలు, గణాంకాలు మహాకుంభం తర్వాత తదుపరి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని సూచిస్తున్నాయి .

మౌలిక సదుపాయాలకు బలోపేతం

ప్రముఖ సిఎ అనిల్ గుప్తా ప్రకారం... మహాకుంభం భావోద్వేగ అంశంతో పాటు ఆర్థిక అంశం కూడా చాలా ముఖ్యమైనది. ఈసారి మహాకుంభం కోసం ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి ద్వారా భారీగా ఆదాయం వస్తుంది. రైల్వే, రవాణా, విద్యుత్తుతో పాటు కుంభమేళాలో అద్దెకు కేటాయించిన భూమి నుండి కూడా ఆదాయం వస్తుంది. జిఎస్టి, మౌలిక సదుపాయాల ద్వారా ప్రభుత్వానికి దాదాపు లక్ష కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ ఆదాయాన్ని ప్రభుత్వం మౌలిక సదుపాయాలకు ఖర్చు చేస్తే ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం కనిపిస్తుంది.

ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వస్తున్నారు, దీనివల్ల పర్యాటక రంగానికి చాలా మేలు జరుగుతుంది. ప్రయాగరాజ్‌లోనే 5 స్టార్, 7 స్టార్ హోటళ్లు లేవు, ఇప్పుడు అవన్నీ ఏర్పాటు అవుతున్నాయి. ఈ అంశాలన్నీ జిడిపి వృద్ధిలో ఒక శాతం పెరుగుదలకు దోహదం చేస్తాయి. జిఎస్టి విషయానికొస్తే, ప్రయాగరాజ్‌తో పాటు రాష్ట్రం మొత్తంలో డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో మూడు రెట్లు పెరిగే అవకాశం ఉంది.

ప్రజల ఆదాయం కూడా పెరుగుతుంది 

అలహాబాద్ విశ్వవిద్యాలయం రిటైర్డ్ డీన్, వాణిజ్య విభాగం, ఆర్థిక అధికారి డాక్టర్ ఎకె సింఘాల్ మాట్లాడుతూ... డబుల్ ఇంజిన్ ప్రభుత్వం మహాకుంభాన్ని గొప్పగా నిర్వహించడంలో ఏమాత్రం వెనకాడలేదు. దీని ప్రభావం ప్రయాగరాజ్‌తో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కనిపిస్తుంది. దేశవిదేశాల నుండి వచ్చే కోట్ల మంది ఇక్కడ డబ్బు ఖర్చు చేస్తారు. రవాణా, స్థానిక వ్యాపారులు, దుకాణదారులు, రిక్షా, టాక్సీ, పడవ వ్యాపారుల ఆదాయం పెరుగుతుంది. తన అంచనా ప్రకారం దాదాపు 40 నుండి 50 వేల కోట్ల రూపాయలు వస్తాయన్నారు. అంతేకాదు ప్రభుత్వం చేసిన ఖర్చుకు 10 రెట్లు లాభం వస్తుంది. ప్రభుత్వానికి వచ్చే డబ్బు అభివృద్ధికి ఉపయోగపడుతుంది. అందరికీ అభివృద్ధికి ఊతం లభిస్తుంది.

రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థలకు కూడా చాలా మేలు జరుగుతుంది. రాష్ట్ర జిడిపిలో ఒక శాతం లేదా అంతకంటే ఎక్కువ పెరుగుదల ఉండవచ్చు. అలహాబాద్‌తో పాటు అయోధ్య, చిత్రకూట్, వారణాసి, వింద్యాచల్ వంటి ప్రాంతాలకు ప్రజలు వెళ్తున్నారు, దీనివల్ల రాష్ట్రానికి లాభం చేకూరుతుంది. ఉత్తరప్రదేశ్‌కు జిఎస్టి ద్వారా వచ్చే ఆదాయంలో కూడా పెరుగుదల కనిపిస్తుంది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుంది. ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది.