ముంబై: మహారాష్ట్రలో రాష్ట్రపతిపాలన విధించవలిసిందిగా గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి కేంద్రానికి సిఫారసు లేఖ పంపినట్టు ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసారు. కేంద్ర కాబినెట్ కూడా ఈ సిఫారసును ఆమోదించినట్టు తెలుస్తుంది. రాష్ట్రపతి ప్రస్తుతం ఢిల్లీలో లేరు. గురుపూర్ణిమ సందర్బంగా సుల్తాన్పూర్ లోది లో ఈ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లారు. రాగానే, ఈ లేఖ పై సంతకం చేయనున్నట్టు తెలుస్తుంది. 

మరోవైపు తమకు సమయం పొడిగించలేదని శివసేన సుప్రీమ్ కోర్టుకు వెళ్ళింది. కపిల్ సిబాల్ ఈ విషయమై వాదనలు వినిపిస్తున్నారు.  

ఎన్నికల ముందు బీజేపీ, శివసేన కలిసి పోటీ చేశాయి. అయితే సీఎం పదవి విషయంలో 50:50 ఫార్మూలాను పాటించాలని శివసేన బీజేపీ నాయకత్వం ముందు ప్రతిపాదనలను తీసుకొచ్చింది. అయితే ఈ ప్రతిపాదనలపై బీజేపీ నాయకత్వం సానుకూలంగా స్పందించలేదు..దీంతో శివసేన కూడ తన పట్టును వీడలేదు. దీంతో గవర్నర్ ఆహ్వానం మేరకు బీజేపీ నేతలు గవర్నర్ తో సమావేశమై ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని గవర్నర్ కు చెప్పారు. 

Also Read:‘‘మహా’’ సంక్షోభం: శివసేనకు కాంగ్రెస్ చివరి ఘడియ షాక్

దీంతో బీజేపీ తర్వాత ఎక్కువ సీట్లను కైవసం చేసుకొన్న పార్టీగా ఉన్న శివసేనను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ ఆహ్వానించారు. కానీ, శివసేన కూడ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకు రాలేకపోయింది. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఎన్సీపీకి గవర్నర్ సోమవారం నాడు రాత్రి ఆహ్వానించారు.

మంగళవారం నాడు రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయమై నిర్ణయాన్ని చెప్పాలని ఎన్సీపీకి గవర్నర్  కోరారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గాను ఎన్సీపీ ప్రయత్నాలను ప్రారంభించింది. కాంగ్రెస్ పార్టీ నేతలతో ఎన్సీపీ సంప్రదింపులు జరుపుతోంది.

కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు మంగళవారం నాడు మధ్యాహ్నం ముంబైకు చేరుకొంటున్నారు.ఈ తరుణంలో  మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తూ రాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ కేంద్ర ప్రభుత్వానికి మంగళవారం నాడు సిఫారసు చేశారు.

also read:కమల్ హాసన్ తో విభేదాలు: హీరో విజయ్ కు ప్రశాంత్ కిశోర్ గాలం?

ప్రధానమంత్రి మోడీ మంగళవారం నాడు మద్యాహ్నం అత్యవసరంగా కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.  ఈ కేబినెట్ సమావేశంలో  మహరాష్ట్రలో రాష్ట్రపతి పాలన విషయమై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది

ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు తమకు రెండు రోజుల పాటు సమయం ఇవ్వాలని శివసేన కోరింది. కానీ, గవర్నర్ గడువు ఇవ్వలేదు. దీంతో శివసేన ప్రభుత్వం ఏర్పాటు విషయంలో వెనక్కు తగ్గింది. ఈ పరిణామాల నేపథ్యంలో గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఎన్సీపీని ఆహ్వానించిన విషయం తెలిసిందే.