తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వానికి మరో షాక్ తగిలింది. 11 ఏళ్ల నాటి అవినీతి కేసుపై హైకోర్టు విచారణ చేపట్టింది. విపక్ష నేతలపై కేసులు నమోదు చేయడం, వారు అధికారంలోకి రాగానే కేసులను రద్దు చేయడం నిత్యకృత్యమైందంటూ న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇప్పటికే అన్నాడీఎంకే పగ్గాలు కోల్పోయి తీవ్ర నైరాశ్యంలో వున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వానికి మరో షాక్ తగిలింది. 11 ఏళ్ల నాటి అవినీతి కేసుపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు ఈ కేసును సుమోటాగా స్వీకరించింది. అంతేకాదు.. ఇప్పటికే ఈ కేసులో ఆయనకు క్లీన్ చిట్ ఇస్తూ దిగువ కోర్ట్ ఇచ్చిన తీర్పుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. 

అసలేంటీ ఈ కేసు :

2001-06 మధ్యకాలంలో దివంగత జయలలిత కేబినెట్‌లో పన్నీర్ సెల్వం రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన ఆదాయానికి మించి రూ.1.77 కోట్లను ఆక్రమంగా సంపాదించారంటూ 2006లో డీఎంకే ప్రభుత్వం ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఆయనతో పాటు సెల్వం భార్య విజయలక్ష్మీ, కుమారుడు రంగనాథ్‌లతో పాటు ఆరుగురిపై ఛార్జీషీట్లు దాఖలు చేశారు అధికారులు. అయితే 2011లో మరోసారి అన్నాడీఎంకే ప్రభుత్వం రాగానే అక్రమార్జన కేసుపై విచారణ జరిపేందుకు అనుమతిని వెనక్కి తీసుకుంది. అంతేకాదు.. సెల్వంపై మోపిన అభియోగాలకు ఆధారాలు లేవంటూ శివగంగ కోర్ట్ 2012లో వీరిని నిర్దోషులుగా తేల్చింది. 

ఈ క్రమంలో దాదాపు 11 ఏళ్ల తర్వాత ఈ కేసును సుమోటాగా స్వీకరించాలని మద్రాస్ హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ ఆనంద్ వెంకటేశ్ నిర్ణయించారు. విపక్ష నేతలపై కేసులు నమోదు చేయడం, వారు అధికారంలోకి రాగానే కేసులను రద్దు చేయడం నిత్యకృత్యమైందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.