Asianet News TeluguAsianet News Telugu

మధ్యప్రదేశ్ వెడ్డింగ్ స్కీమ్ కిట్‌లలో కండోమ్‌లు, బర్త్ కంట్రోల్ పిల్స్..

మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కన్యా వివాహ యోజన పథకం మరోసారి వివాదాస్పదంగా మారింది. కొత్త జంటలకు పంపిణీ చేసిన మేకప్ బాక్సుల్లో కండోమ్ లు, బర్త్ కంట్రోల్ పిల్స్ కనిపించాయి.

Madhya Pradesh Wedding Scheme Kits include Condoms, Birth Control Pills - bsb
Author
First Published May 30, 2023, 1:26 PM IST

భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని ఝబువా జిల్లాలో సోమవారం జరిగిన సామూహిక వివాహ కార్యక్రమంలో వధువులకు ఇచ్చిన మేకప్ బాక్సుల్లో కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు దొరికాయి. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కన్యా వివాహం/నికా యోజన అనే పథకాన్ని ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళల కోసం మధ్యప్రదేశ్ లో ప్రవేశపెట్టారు.

ఈ పథకం కింద సామూహిక వివాహ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో 296 జంటలు వివాహం చేసుకున్నాయి. ఈ పథకం కింద నవ దంపతులకు కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలు పంపిణీ చేశారు. పథకంలో భాగంగా దంపతులకు పంపిణీ చేసిన మేకప్ బాక్సుల్లో ఈ ప్యాకెట్లు కనిపించాయి.

తప్పిన పెను ప్రమాదం.. బెళగావిలో ట్రైనింగ్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. పైలట్లకు గాయాలు

దీని మీద విమర్శలు వెల్లువెత్తడంతో.. జిల్లా సీనియర్ అధికారి భూర్సింగ్ రావత్ స్పందిస్తూ రాష్ట్ర ఆరోగ్య శాఖపై నిందలు వేశారు. కుటుంబ నియంత్రణకు సంబంధించిన అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య అధికారులు కండోమ్‌లు, గర్భనిరోధక సాధనాలను పంపిణీ చేసి ఉంటారని అన్నారు.

"కండోమ్‌లు, గర్భనిరోధక మాత్రలను పంపిణీ చేసే బాధ్యత మాది కాదు. కుటుంబ నియంత్రణ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య శాఖ మెటీరియల్‌ని అందజేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కన్యా వివాహం/నికా యోజన కింద, మేము నేరుగా రూ 49,000ని లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాకు బదిలీ చేస్తాం. ఆహారం, నీరు, టెంట్ అందించే బాధ్యత మాది, దీని విలువ రూ. 6,000. పంపిణీ చేసిన ప్యాకెట్లలో ఏముందో నాకు తెలియదు" అని రావత్ చెప్పారు.

మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళల వివాహాలకు ఆర్థిక సహాయం అందించడానికి ఏప్రిల్ 2006లో ముఖ్యమంత్రి కన్యా వివాహం/నికా యోజనను ప్రారంభించింది. పథకం కింద, ప్రభుత్వం వధువు కుటుంబానికి రూ. 55,000 అందిస్తుంది.

గత నెలలో, దిండోరిలోని గడ్సరాయ్ ప్రాంతంలో జరిగిన సామూహిక వివాహ కార్యక్రమంలో కొంతమంది వధువులకు ప్రెగ్నెన్సీ పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించడంతో ఈ పథకంపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్‌గా వచ్చిన ఒక మహిళ పెళ్లికి ముందు తన కాబోయే భర్తతో కలిసి జీవిస్తున్నట్లు చెప్పింది.

వధూవరుల వయస్సును నిర్ధారించడానికి, సికిల్ సెల్ అనీమియాను తనిఖీ చేయడానికి, వారు శారీరకంగా దృఢంగా ఉన్నారని నిర్ధారించడానికి సాధారణంగా పరీక్షలు నిర్వహిస్తారని డిండోరి చీఫ్ మెడికల్ ఆఫీసర్ చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios