కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విద్యాసంస్థలు మూతపడ్డాయి. అయితే.. ఆ తర్వాత ఇప్పుడిప్పుడే కొన్ని రాష్ట్రాల్లో పాక్షికంగా విద్యా సంస్థలను ప్రారంభిస్తున్నాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం మాత్రం స్కూళ్లు తెరిచే విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఒకటి నుంచి 8వ తరగతులను మార్చి 31 వరకూ ప్రారంభించరాదని నిర్ణయించింది. 

అలాగే, ఈ ఏడాది ఐదు, ఎనిమిది తరగతి బోర్డు పరీక్షలను కూడా రద్దు చేసింది. తొమ్మిది నుంచి 12 వ తరగతి వరకూ చదివే విద్యార్థులకు వారంలో ఒకటి లేదా రెండు రోజుల పాటు తరగతులు నిర్వహించనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన విద్యాశాఖాధికారులతో శుక్రవారం జరిగిన సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు.

‘1 నుంచి 8 తరగతుల విద్యార్థులకు మార్చి 31 వరకూ పాఠశాలలు ప్రారంభించరాదు.. ఏప్రిల్ 1 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది.. ప్రాజెక్టు వర్క్ ఆధారంగా ఒకటి నుంచి ఎనిమిది విద్యార్థులను ప్రమోట్ చేస్తాం.. బోర్డు పరీక్షలున్న పది, ఇంటర్ విద్యార్థులకు తర్వలోనే తరగతులు ప్రారంభిస్తాం.. భౌతికదూరం సహా ఇతర కరోనా నిబంధనలు పాటిస్తూ వారంలో ఒకటి లేదా రెండు రోజులు తొమ్మిది, ఇంటర్ తరగతులు నిర్వహిస్తాం’ అని ముఖ్యమంత్రి శివ్‌రాజ్ సింగ్ చౌహన్ అన్నారు.