మధ్యప్రదేశ్‌లో ఓ వివాహిత తన పిల్లలతోపాటు బావిలో దూకేసింది. భర్తతో జరిగిన గొడవతో మనస్తాపం చెందిన ఆ మహిళ ముందుగా పిల్లలను బావిలోకి తోసేసి ఆ తర్వాత తాను దూకేసింది. ఆ తర్వాత ప్రాణాలపై ఆశ పుట్టడంతో బావిలోకి వేలాడుతున్న ఓ తాడును పట్టుకుని పెద్ద బిడ్డతో బయటకు వచ్చింది. ముగ్గురు పిల్లలు బావిలోనే మరణించారు.
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఓ తల్లి నలుగురు పిల్లలతోపాటు బావిలో దూకేసింది. ముందు పిల్లలను బావిలో తోసేసి ఆ తర్వాత తానూ దూకేసింది. కానీ, అందులో దూకిన తర్వాత మళ్లీ ప్రాణాలపై ఆశ పుట్టింది. ఎలాగైనా బతకాలని అనుకుంది. బావిలోకి లోతుగా వేలాడుతున్న ఓ తాడును అందుకుంది. పెద్ద బిడ్డను పట్టుకుని ఆమె బయటకు వచ్చేసింది. ఈ ఇద్దరు బయటకు వచ్చారు. కానీ, ముగ్గురు పిల్లలు ఆ బావిలోనే విగతజీవులయ్యారు.
ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బుర్హన్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ జిల్లాకు 60 కిలో మీటర్ల దూరంలోని బాల్ది గ్రామంలో 30 ఏళ్ల ప్రమిలా భిలాలా భర్త రమేశ్‌తో కలిసి జీవిస్తున్నది. వారికి నలుగురు పిల్లలు. ముగ్గురు బిడ్డలు, ఒక కొడుకు.
ఆ భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. తీవ్ర మనస్తాపం చెందిన భార్య ప్రమిలా ఆత్మహత్య చేసుకోవాలనే క్షణికావేశానికి లోనైంది. అంతేకాదు, తన పిల్లలనూ వెంట తీసుకెళ్లాలని అనుకుంది. ఇంటికి సమీపంలోని బావి వద్దకు వారందరినీ తీసుకెళ్లింది.
Also Read: బీజేపీ శాసనసభ్యులతో వేదిక పంచుకున్న బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ దోషులు.. సర్వత్రా ఆగ్రహం
ముందు పిల్లలను బావిలో తోసేసింది. ఆ తర్వాత తాను ఆ బావిలో దూకింది. నీటిలో మునిగిపోతుండగా మళ్లీ జీవించాలని అనుకుంది. ఆ బావిలో వేలాడుతున్న ఓ తాడును పట్టుకుని సేఫ్‌గా బయటకు ఎక్కి వచ్చింది. తన పెద్ద కూతురిని కూడా తీసుకువచ్చింది. కానీ, మూడేళ్లు, ఐదేళ్ల వయసున్న ఇద్దరు బిడ్డలను బావిలోనే వదిలిపెట్టింది. 18 నెలల కొడుకునూ బావిలోనే విడిచింది.
బావిలో నుంచి ముగ్గురి డెడ్ బాడీలను బయటకు తీశామని ఎస్పీ రాహుల్ కుమార్ తెలిపారు. పోస్టుమార్టం కోసం పంపించామని వివరించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు ఫైల్ చేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రమిల భిలాలా, ఆమె ఏడేళ్ల పెద్ద కూతురు ప్రమాదం నుంచి బయటపడ్డా రని వివరించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర అలజడి రేపింది.
