భోపాల్: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. సామాన్యుడు మొదలు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు సైతం ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇలా తాజాగా మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ కేబినెట్ లోని  ఓ మంత్రికి కూడా కరోనా సోకింది. గతకొద్దిరోజులు కరోనా లక్షణాలతో బాధపడుతున్న సదరు మంత్రి పరీక్ష  చేయించుకోగా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయన గురువారం ఉదయం భోపాల్ లోని చిరయూ హాస్పిటల్ లో చేరి చికిత్స పొందుతున్నారు.   

అయితే ఇటీవల జరిగిన ఎంపీ గవర్నర్ లాల్జీటాండన్ అంత్యక్రియల్లో సదరు మంత్రి పాల్గొన్నారు.  అంతేకాకుండా మంగళవారం సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలోనూ పాల్గొన్నారు. అలాగే వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ, తన నియోజకవర్గ పరిధిలో జరిగిన కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొన్నారు. దీంతో ఆయన పాల్గొన్న కార్యక్రమాలకు హాజరైన నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రజల్లో ఆందోళన నెలకొంది. 

READ MORE  కరోనాతో వ్యక్తి మృతి.. అంబులెన్స్ తగలపెట్టిన బంధువులు

ఇదిలావుంటే దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 45, 720 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 12,38,635కి చేరుకొంది. ఒక్క రోజులోనే 1129 మంది మరణించినట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి.

దేశంలో ఇప్పటివరకు కరోనా సోకి 7,82,606 మంది కోలుకొన్నారు. మరో వైపు 4,26, 167 యాక్టివ్ కేసులున్నట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. కరోనాతో దేశంలో మరణించినవారి సంఖ్య  29,861కి చేరుకొంది.

ఇప్పటివరకు దేశంలోని పలు రాష్ట్రాల్లో 1,50,75,369 మంది నుండి శాంపిళ్లను సేకరించారు. బుధవారం నాడు ఒక్క రోజునే 3,50, 823 శాంపిళ్లను తీసుకొన్నట్టుగా ఐసీఎంఆర్ తెలిపింది.

 కరోనాను నిరోధించే వ్యాక్సిన్ తయారీలో ప్రయోగాలు మంచి పురోగతిని సాధిస్తున్నట్టుగా పలు సంస్థలు ప్రకటించాయి. కొన్ని సంస్థల ట్రయల్స్ చివరి దశలో ఉన్నాయి. 2021 ప్రారంభం నాటి వరకు వ్యాక్సిన్ వస్తోందని చెప్పలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.

 తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 22న కొత్తగా 1554 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులోనే 9 మంది మరణించారు. రాష్ట్రంలో 49,259కి కరోనా కేసులు చేరుకొన్నాయి. ఇందులో 11,155 యాక్టివ్ కేసులని ప్రభుత్వం తెలిపింది. కరోనాతో ఇప్పటివరకు 438 మంది మరణించారు. 

కరోనా మరణాల్లో ప్రపంచంలోనే ఆరో స్థానానికి భారత్ చేరువగా నిలిచింది. ప్రస్తుతం 30 వేల మంది రోగుల మరణాలతో ఫ్రాన్స్ ఆరో స్థానంలో ఉంది. నిన్న స్పెయిన్ ను దాటి ఇండియా ఏడో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.