కరోనా వైరస్ దేశంలో విలయతాండవం చేస్తోంది. దేశంలో రోజు రోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. మృతుల సంఖ్య కూడా అంతకంతకు పెరిగిపోతోంది. నిన్నటికి నిన్న.. భారత్ లో దాదాపు 50వేల కేసులు నమోదు కావడం గమనార్హం. మరణాలు సైతం కేవలం నిన్న ఒక్కరోజే 1100లకు పైగా చోటుచేసుకున్నాయి.

ఇదిలా ఉండగా... కర్ణాటకలో ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందగా... సదరు వ్యక్తి బంధువులు ఆగ్రహంతో ఊగిపోయారు. అంబులెన్స్ ని తగలపెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కర్ణాటకకు చెందిన జి.గాలి(55) అనే వ్యక్తి ఈ నెల 19వ తేదీన శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో చికిత్స నిమిత్తం  బెలగావి ఆస్పత్రిలో చేరాడు. కాగా.. అతనికి పరీక్షలు చేసిన వైద్యులు కోవిడ్ 19 పాజిటివ్ గా తేల్చారు. కాగా.. వెంటనే అతనికి వైద్యులు చికిత్స చేయడం ప్రారంభించారు.

అయితే.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే అతను బుధవారం కన్నుమూశాడు. ఈ విషయాన్ని వైద్యులు అతని కుటుంబసభ్యులకు తెలియజేశారు. అంతే.. అతని కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహంతో ఊగిపోయారు. హాస్పిటల్ వద్దకు చేరుకొని నానా హంగామా సృష్టించారు. ఆస్పత్రి పై రాళ్లు విసిరారు. అయినా వారి కోపం చల్లారకపోవడంతో.. అంబులెన్స్ కి నిప్పు అంటించారు. హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యంగా కారణంగా అతను చనిపోయాడంటూ మండిపడ్డారు.

కాగా.. వారు చేస్తున్న ఆందోళనను అదుపు చేసే క్రమంలో ఓ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడటం గమనార్హం. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.