ఇటీవలి కాలంలో ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బు పంపిణీ చేయడం సర్వ సాధారణంగా మారిపోయింది. చాలా మంది గెలుపు కోసం ఇదే పద్దతిని పాటిస్తున్నారు. 

ఇటీవలి కాలంలో ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బు పంపిణీ చేయడం సర్వ సాధారణంగా మారిపోయింది. చాలా మంది గెలుపు కోసం ఇదే పద్దతిని పాటిస్తున్నారు. ఏ ఎన్నికైనా సరే బరిలో నిలిచే అభ్యర్థులు విజయం కోసం అడ్డదారిలో ఓట్ల కోసం భారీగా ఖర్చుచేస్తున్నారు. ఇలా భారీగా డబ్బు ఖర్చుచేసి.. ఎన్నికల్లో ఓడిపోయి ఆర్థికంగా నష్టపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. అయితే తాజాగా మధ్యప్రదేశ్‌లో ఎన్నికల్లో విజయం కోసం ఓ వక్తి భారీగా డబ్బులు ఖర్చుచేశాడు.. కానీ ఓడిపోవడంతో ఎన్నికల సమయంలో పంచిన డబ్బును తిరిగి ఇవ్వాల్సిందిగా ఓటర్లపై బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. 

వివరాలు.. నీముచ్ జిల్లాలోని మానస తహసీల్‌లోని దేవరాన్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి జరిగిన ఎన్నికల్లో Raju Dayma పోటీచేసి ఓడిపోయాడు. తాను ఓడిపోవడంతో.. ఎన్నికల సమయంలో పంచిన డబ్బును తిరిగి ఇవ్వాలని అతడు ప్రజలపై బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియా ఆధారంగా పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. 

రాజు, అతని సహచరుడు కన్హయ్య బంజారాపై రాంపుర పోలీస్ స్టేషన్‌లో ప్రజలను బెదిరించడం, కొట్టడం వంటి నేరాలపై ఐపీసీలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదైందని.. అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ASP) సుందర్ సింగ్ కాలేష్ తెలిపారు. అంతేకాకుండా.. ఎన్నికల సమయంలో డబ్బు పంపిణీ చేసినందుకు నిందితులపై మరిన్ని అభియోగాలు మోపవచ్చని ఆయన అన్నారు. డబ్బు తిరిగి ఇవ్వమని అడుగుతున్న సమయంలో నిందితులు ప్రజలను బెదిరిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుందని చెప్పారు. ఈ ఘటన బహుశా గత వారం చిత్రీకరించబడిందని ఆయన అన్నారు.

ఇక, వీడియో ద్వారా ఎన్నికల సమయంలో రాజు పంపిణీ చేసినట్టుగా తెలుస్తోందని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే నిందితుడు పంచాయితీ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత ప్రజల నుండి సుమారు రూ. 4 లక్షలను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది.