12 ఏళ్లకే ఇంటర్ పూర్తి చేసిన మధ్యప్రదేశ్‌కు చెందిన తనిష్క సుజిత్ అనే బాలిక ప్రధాని నరేంద్ర మోడీని కలిసింది. ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తిని కావాలన్నదే తన కల అని చెప్పింది.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన తనిష్క సుజిత్ 15 ఏళ్ల చిన్న వయసులోనే డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలకు సిద్ధమై వార్తల్లో నిలిచింది. ఈ సందర్భంగా లా చదివి దేశ ప్రధాన న్యాయమూర్తి కావాలన్నదే తన లక్ష్యమని ఈ బాలిక తెలిపింది. 2020లో కోవిడ్ 19 కారణంగా తన తండ్రి, తాతయ్యలను తనిష్క కోల్పోయింది. కొద్దిరోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన ఈమె గుర్తుచేశారు. తన కలను కొనసాగించడానికి ఆయన ప్రోత్సహించారో తనిష్క వివరించింది.
ఇండోర్‌లోని దేవి అహల్య యూనివర్సిటీ విద్యార్ధిని అయిన తనిష్క సుజిత్ సోమవారం పీటీఐతో మాట్లాడుతూ.. ఏప్రిల్ 19 నుంచి 28 వరకు జరిగే తన బీఏ (సైకాలజీ) చివరి సంవత్సరం పరీక్షలకు హాజరవుతానని చెప్పారు. 10వ తరగతిలో మొదటి డివిజన్‌లో ఉత్తీర్ణత సాధించిన తనిష్క.. 13 ఏళ్ల వయసులోనే 12వ తరగతి పరీక్షలను క్లియర్ చేసింది.
దేవి అహల్య యూనివర్సిటీ సోషల్ సైన్స్ స్టడీస్ విభాగాధిపతి రేఖా ఆచార్య మాట్లాడుతూ.. సుజిత్‌కు 13 ఏళ్ల వయసున్నప్పుడు యూనివర్సిటీ నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ప్రత్యేక ప్రతిభ చూపడంతో బీఏ (సైకాలజీ) మొదటి సంవత్సరంలో ప్రవేశం లభించిందన్నారు. కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ కోసం ఏప్రిల్ 1న భోపాల్‌కు వెళ్లిన సమయంలో తనిష్క ..ప్రధాని మోడీని కలిసింది. దాదాపు 15 నిమిషాల పాటు సాగిన భేటీలో బాలిక మాట్లాడుతూ.. తాను బీఏ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత అమెరికాలో లా చదవాలని అనుకుంటున్నట్లు చెప్పింది. ఏదో ఒక రోజు భారత ప్రధాన న్యాయమూర్తి కావాలన్నదే తన కల అని ప్రధానితో తెలిపింది.
తన లక్ష్యం గురించి విన్న ప్రధాని నరేంద్ర మోడీ.. సుప్రీంకోర్టుకు వెళ్లి అక్కడి న్యాయవాదుల వాదనలు చూడాలని సలహా ఇచ్చారని తనిష్క చెప్పింది. అది తన లక్ష్యాన్ని సాధించడానికి తనను ప్రేరేపిస్తుందని.. ప్రధానిని కలవడం అనేది తన కల అని ఆమె పేర్కొంది.
తనిష్క తల్లి అనుభ మాట్లాడుతూ.. తన భర్త, మామ గారు 2020లో కరోనా కారణంగా చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే చదువులో రాణిస్తున్న తన కుమార్తె కోసం తాను ఎంతో పోరాటం చేస్తూ బాధను అధిగమించానని అనుభ చెప్పారు. ఇద్దరు కుటుంబ సభ్యులను కోల్పోయిన తర్వాత.. తన మనసు ఈ లోకంలో లేదని చెప్పింది. రెండు మూడు నెలలు గడిచిన తర్వాత.. తన కుమార్తె భవిష్యత్తు దృష్ట్యా ఆమె చదువుపై తాను శ్రద్ధ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు అనుభ పేర్కొన్నారు.
