పబ్జీ గేమ్ కారణంగా మరో విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఆరు గంటలపాటు కంటిన్యూస్ గా పబ్జీ గేమ్ ఆడి... ఇంటర్ విద్యార్థి గుండె నొప్పితో కుప్పకూలిపోయాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... నసీరాబాద్‌లోని కేంద్రీయ విద్యాలయలో 12వ తరగతి చదువుతున్న ఫర్ఖాన్ ఖురేషీ (16) ఓ వివాహ కార్యక్రమం కోసం కొద్ది రోజుల క్రితం నీమచ్‌లోని తన తాతయ్య ఇంటికి వచ్చాడు. మే 25న అందరూ పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉండగా... ఫర్ఖాన్ ఆ రోజు రాత్రంతా తన మొబైల్ ఫోన్‌లో పబ్జీ ఆడుతూనే ఉన్నాడు.

ఆ తర్వాతి రోజు కూడా కంటిన్యూస్ గా ఆరుగంటలపాటు పబ్జీగేమ్ ఆడాడు. ఆట మధ్యలోనే ఒక్కసారిగా గుండెలో నొప్పి అంటూ పడిపోయాడు. పక్కనే ఉండి గమనించిన అతని సోదరి... ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వాళ్లు వచ్చి ఖురేషీని ఆస్పత్రికి తరలించగా... గుండె పోటుతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

నీమచ్‌కి చెందిన కార్డియాలజిస్టు డాక్టర్ అశోక్ జైన్ మాట్లాడుతూ.. ‘‘ఒక్కసారిగా తీవ్రమైన షాక్‌కు గురికావడం వల్ల వచ్చే గుండెపోటు కారణంగా అతడు చనిపోయినట్టు తెలుస్తోంది. విరామం లేకుండా గంటల తరబడి ఆడుతూ ఉండడం వల్ల అతడు బయటికి రాలేనంతగా... ఒకరకమైన మానసిక స్థితిలో మునిగిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో ఒకేసారి ఉద్రేకంగానీ, ఓటమి భయంగానీ కలిగితే ఆ షాక్ వల్ల గుండెపోటు వస్తుంది. ఇది చివరికి మరణానికి దారితీస్తుంది..’’ అని వివరించారు.