shocking incident: ఓ న‌దిలో ఈత కొడుతున్న బాలుడుని మొస‌లి మింగేసింది. ఆగ్ర‌హించిన గ్రామ‌స్థులు మొస‌లిని ప‌ట్టుకుని దాని క‌డుపులో నుంచి బాలుడిని తీయ‌డానికి ప్ర‌య‌త్నించారు.  

Madhya Pradesh: మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో ఓ షాకింగ్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఓ న‌దిలో ఈత కొడుతున్న బాలుడుని మొస‌లి మింగేసింది. ఆగ్ర‌హించిన గ్రామ‌స్థులు మొస‌లిని ప‌ట్టుకుని దాని క‌డుపులో నుంచి బాలుడిని తీయ‌డానికి ప్ర‌య‌త్నించారు. అయితే, విష‌యం తెలుసుకున్న అధికారులు అక్క‌డికి చేరుకుని గ్రామ‌స్థుల‌ను అడ్డుకున్నారు. వివ‌రాల్లోకెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌లో పదేళ్ల బాలుడిని మొసలి మింగేసింది. సోమవారం ఉదయం చంబల్ నదిలో స్నానం చేస్తుండగా బాలుడిపై మొసలి దాడి చేసింది. మొసలి బాలుడిని నదిలోకి తీసుకుపోయింది. సంఘటనా స్థలంలో ఉన్న స్థానికులు వెంటనే అతని కుటుంబీకులు, బంధువులకు ఫోన్ చేసి ఈ విష‌యం గురించి చెప్పారు. వెంట‌నే వారంద‌రూ క‌లిసి కర్రలు, తాడు, వల సహాయంతో మొసలిని పట్టుకున్నారు. వారు నది నుండి మొసలిని బయటకు తీసుకువ‌చ్చారు. బాలుడు దాని క‌డుపులోని ఉన్నాడ‌ని చెప్పారు. 

ఈ క్ర‌మంలోనే ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న ఎలిగేటర్ విభాగ బృందం, పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గ్రామస్తుల బారి నుంచి మొసలిని రక్షించేందుకు ఇరు బృందాలు ప్రయత్నించాయి. అయితే సాయంత్రం వరకు బాలుడి కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించలేదు. మొసలి కడుపులో బిడ్డ బతికే ఉంటుందని పదేళ్ల చిన్నారి కుటుంబ సభ్యులు ఆశగా ఎదురు చూస్తున్నారు. మొసలి బిడ్డను బయటకు పంపినప్పుడే వదిలేస్తామని డిమాండ్ చేశారు. అధికారుల తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ... ఆందోళ‌న‌కు దిగారు. ఈ ఘ‌ట‌న‌పై రఘునాథ్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ శ్యామ్ వీర్ సింగ్ తోమర్ తెలిపిన వివరాల ప్రకారం.. “బాలుడు స్నానం చేస్తూ నదిలోకి లోతుగా వెళ్ళాడు. చిన్నారిని మొసలి మింగేసిందని గ్రామస్తులు తెలిపారు. అనంతరం వల, కర్రలతో మొసలిని పట్టుకున్నారు. ఎలిగేటర్ విభాగం ఈ విషయంలో చర్యలు ప్రారంభించింది.

ఈ క్ర‌మంలోనే అధికారులు చంబ‌ల్ న‌ది ప్రాంతంలో వెతుకులాట ప్రారంభించారు. అయితే, బాలుడి గురించి స‌మాచారం విష‌యంలో ఫ‌లితం లేకుండా పోయింది. అయితే, మొస‌లి తినేస్తే బాలుడు బ‌తికి ఉండే అవ‌కాశం లేద‌నీ, దానిని క‌డుపును చీల్చ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం లేద‌ని అధికారులు గ్రామ‌స్తుల‌కు చెప్పారు. కొన్ని గంట‌ల త‌ర్వాత గ్రామ‌స్తులు శాంతించి.. ఆ మొస‌లిని త‌మ ప్రాంతానికి దూరంగా వ‌దిలేయాల‌ని చెప్పారు. అధికారులు ఆ మొస‌లిని విడిచిపెట్టారు.