50 ఏళ్లుగా డీఎంకె అధ్యక్షుడిగా కరుణానిధి

M. Karunanidhi: at the 50th year of being at the helm of DMK
Highlights

డీఎంకె అధ్యక్షుడిగా కరుణానిధి 50 ఏళ్లుగా కొనసాగుతున్నారు. డీఎంకె పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టి ఈ నెల 27వ తేదీకి కరుణానిధి 50 ఏళ్లు పూర్తి చేసుకొన్నారు.సుధీర్ఘకాలంపాటు డీఎంకెకు కరుణానిధి పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
 


చెన్నై: డీఎంకె అధ్యక్షుడిగా కరుణానిధి 50 ఏళ్లుగా కొనసాగుతున్నారు. డీఎంకె పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టి ఈ నెల 27వ తేదీకి కరుణానిధి 50 ఏళ్లు పూర్తి చేసుకొన్నారు.సుధీర్ఘకాలంపాటు డీఎంకెకు కరుణానిధి పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

అన్నాదురై ఏర్పాటు చేసిన డీఎంకె పార్టీ తొలుత 1967లో అధికారంలోకి వచ్చింది.అన్నాదురై మరణించిన తర్వాత 1969 జూలై 27 డీఎంకే అధ్యక్షునిగా కరుణానిధి బాధ్యతలు చేపట్టారు.ఆనాటి నుండి ఆయన పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. డీఎంకె నుండి ఎంజీఆర్ విడిపోయి అన్నాడీఎంకె ను ఏర్పాటు చేశారు. డీఎంకె నుండి వైగో విడిపోయి ఎండీఎంకే ను ఏర్పాటు చేశారు.

అనేక ఆటుపోట్లను తట్టుకొంటూ కూడ డీఎంకెను కరుణానిధి నడిపించారు. 1971 శాసనసభ ఎన్నికల్లో డీఎంకే సాధించిన విజయాన్ని ఇప్పటివరకు ఎవరూ అధిగమించలేదు. ఎన్నికల్లో ఓటమి ఎరుగని నేతగా కరుణానిధి పేరుగడించారు. 13 ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన పలు నియోజక వర్గాల నుంచి గెలుపొంది ఖ్యాతి పొందారు.

తమిళనాడు ప్రజలు ఆప్యాయంగా కలైజ్ఞర్ అని పిలుచుకునే కరుణానిధి 1924 జూన్ నెల 3వ తేదీన అప్పటి అవిభక్త తంజావూర్ జిల్లాలోని తిరుకువళైలోని ఓ నాదస్వర విద్వాంసుల కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి పేరు ముత్తు వేలన్, తల్లిపేరు అంజుగమ్మ. విజయ నగర సామ్రాజ్యధీసుల కాలంలో వీరి కుటుంబం ఆంధ్ర ప్రాంతం నుంచి తమిళనాడుకు వలస వచ్చినట్లు చెబుతారు. తండ్రి వద్ద బాల్యదశలో కొంతకాలం కరుణానిధి నాద స్వరం కూడా నేర్చుకున్నారు. తలితండ్రులు ఆయనకు పెట్టిన తొలి పేరు దక్షిణామూర్తి. ద్రావిడోద్యమంలో భాగంగా హేతువాదులైన ద్రావిడ నాయకులు మతపరమైన పేర్లను త్యజించిన తరుణంలో ఆయన సొంత పేరును కరుణానిధిగా మార్చుకున్నారు. పెరియార్ ద్రావిడ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై ఆయన నిర్వహించే కుడియరసు పత్రికలో ఉప సంపాదకుడిగా చేరారు. ఎన్నో వ్యాసాలు రాశారు.

1949లో పెరియార్‌తో విభేదించిన ఆయన  ప్రధాన శిష్యుడు అన్నాదురై డీఎంకే స్థాపించినప్పుడు డీఎంకే వ్యవస్థాపక సభ్యుల్లో కరుణానిధి ఒకరు. ఆ పార్టీ కోశాధికారిగా కరుణానిధిని అన్నాదురై నియమించారు. ద్రావిడ భావజాలం, హేతువాద సిద్ధాంతాల పట్ల కరుణానిధికి ఉన్న నిబద్ధత, ఆయనకున్న వాక్పటిమ, రచనా పాటవం కారణంగా అనతికాలంలోనే డీఎంకేలోని అగ్రశ్రేణి నాయకులలో ఒకరుగా ఆయన ఎదిగారు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి సీమాంధ్ర ప్రాంతం విడిపోయిన అనంతరం తమిళనాడు శాసనసభకు జరిగిన ఎన్నికలలో 1957లో తొలిసారి డీఎంకే రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో పోటీ చేసింది. ఆ ఎన్నికలో కరుణానిధి తమిళనాడులోని కుళితలై నియోజక వర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. అప్పటికి ఆయన వయసు 33 సంవత్సరాలు. తమిళనాడు శాసనసభకు జరిగిన ఎన్నికల్లో 13 సార్లు శాసనసభకు ఎన్నికైన వ్యక్తిగా కరుణానిధి రికార్డు నెలకొల్పారు.

1967 డీఎంకే తొలిసారి తమిళనాట అధికారం చేపట్టినప్పుడు ముఖ్యమంత్రి అన్నాదురై కేబినెట్లో ప్రజాపనుల శాఖ మంత్రిగా కరుణానిధి బాధ్యతలు చేపట్టారు. 1969లో అన్నాదురై మరణానంతరం కరుణానిధి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టారు. అంతేకాదు పార్టీ అధ్యక్ష పదవిలో కూడ కొనసాగారు. ఆ సమయంలో ఆయన వయస్సు 45 ఏళ్లు. 

ఐదు దశాబ్దాలుగా కరుణానిధి పార్టీ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. ఐదుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి అత్యధిక కాలం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా ఖ్యాతికెక్కారు. పోటీ చేసిన అన్ని శాసనసభ ఎన్నికలలోనూ గెలుపొందిన ఘనత కరుణానిధిది.


 

loader