మన్ దీప్ కౌర్ అలియాస్ మోనాను పోలీసులు హేమకుండ్ లో అరెస్ట్ చేశారు. ఫ్రీ ఆఫర్ కు టెంప్ట్ అయి ఆమె దొరికిపోయింది.
పంజాబ్ : పంజాబ్ లోని లుథియానాలో ఓ మహిళ రూ. ఎనిమిది కోట్ల 49 లక్షలు చోరీ చేసింది. చివరికి ఫ్రీ ఫ్రూటీ అని పెట్టిన ఆఫర్ కి దొరికిపోయింది. విచిత్రంగా ఉన్న ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మాస్టర్ మైండ్ ‘డాకూ హసీనా’ మన్ దీప్ కౌర్.. ఉరఫ్ మోనాను పంజాబ్ పోలీసులు ఉత్తరఖండ్లో అరెస్టు చేశారు. ఆ సమయంలో ఆమె భర్తతోపాటు ఉత్తరాఖండ్ లోని చమేలీలో ఉన్న హేమకుండ్ సాహెబ్ కు మొక్కు తీర్చుకునేందుకు వెడుతోంది.
ఈ భారీ చోరీ కేసులో ఇప్పటికే ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు మరో 9మందిని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.5,96,00,000 స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు కు సంబంధించిన వివరాలను పోలీస్ అధికారి మన్ దీప్ సింగ్ సిద్దూ మీడియాకు వెల్లడించారు. క్యాష్ వ్యాన్ చోరీ చేసిన మన్ దీప్ కౌర్ తన భర్తతో కలిసి నేపాల్ మార్గంలో విదేశాలకు పారిపోవచ్చని పోలీసులకు సమాచారం అందింది. అయితే, అప్పటికే వారి మీద లుక్ అవుట్ నోటీసులు జారీ అవ్వడంతో.. విదేశాలకు పారిపోవాలన్న వారి ప్రయత్నం విఫలమైంది.
భారతీయులు రక్తంతో అనుసంధానమయ్యారు.. ఆపరేషన్ గంగాపై డాక్యుమెంటరీలో ప్రధాని మోదీ
వారిని అరెస్టు చేసిన తర్వాత వారి నుంచి ఇరవై ఒక్క లక్షలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మన్ దీప్ కౌర్ భర్త గౌరవ్ ఉరఫ్ గుల్షన్ ను కూడా అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. వీరిని పట్టుకోవడానికి…‘ఫ్రీ ఫ్రూటీ సర్వీస్’ పేరుతో వలపన్నామని పోలీసులు తెలిపారు. ఈ ఉచితంగా వచ్చే ఫ్రూటీని తీసుకోవడానికి ఆమె రాగానే అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.
క్యాష్ వ్యాన్ చోరీ చేయడం విజయవంతం కాగానే తన మొక్కులు తీర్చుకునేందుకు.. మన్ దీప్ కౌర్ భర్తతో కలిసి హేమకుండ్ కు వచ్చింది. దర్శనం చేసుకుని మొక్కలు తీర్చుకుని వారు వెళుతున్న సమయంలో పోలీసులు పన్నిన వలలో చిక్కుకున్నారు. హేమ కుండ్ నుంచి మన్ దీప్ కౌర్ దంపతులు బద్రీనాథ్, కేదార్నాథ్ వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు.
ఇంతకీ చోరీ ఎలా జరిగిందంటే…
లుధియానాలోని న్యూరాజ్ గురు నగర్ ప్రాంతంలో ఉన్న సిఎంఎస్ సెక్యూరిటీస్ కి చెందిన ఒక క్యాష్ ఫ్యాన్ ను జూన్ 10న రాత్రి సమయంలో ఆయుధాలు ధరించిన దుండగులు చోరీ చేశారు. ఆ సమయంలో ఈ వ్యాన్లో రూ.8 కోట్ల 49లక్షలు ఉన్నాయి. చోరీ జరిగిన తర్వాత.. విషయం తెలిసిన పోలీసులు చేపట్టిన గాలింపులో లుధియానాకు 20 కిలోమీటర్ల దూరంలోని ముల్లాపూర్ లో రోడ్డు పక్కన అనుమానాస్పద స్థితిలో పోలీసులకు క్యాష్ వన్ కనిపించింది. అందులో మారణాయుధాలు కూడా కనిపించడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు.
ఈ చోరీకి సంబంధించిన నిందితులను పట్టుకునేందుకు లుధియానా పోలీసులు సైబర్ టీం సహాయం తీసుకున్నారు. వ్యాన్ జిపిఎస్ ను ట్రాక్ చేశారు. నిందితుల మొబైల్ టవర్ డీటెయిల్స్ కూడా తీసుకున్నారు. వీటి సహాయంతో ఐదుగురు నిందితులను వెంటనే పట్టుకున్నారు. వారి దగ్గర నుంచి 5 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ చోరీ వెనక మాస్టర్ మైండ్ మన్ దీప్ కౌర్ అని తెలిసింది. ఆమె తన భర్త.. మరో ఐదుగురితో కలిసి పరార్ అయ్యింది. అయితే, పోలీసులు మన్ దీప్ కౌర్ మూమెంట్స్ ను ట్రాక్ చేశారు. చివరికి ఆమెను, మిగతా వారిని హేమకుండ్ లో అరెస్టు చేశారు.
