కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు షాక్ ఇచ్చింది. గ్యాస్ సిలిండర్ ధరను మరింత పెరిగింది. ప్రస్తుత పరిస్ధితుల్లో ధరల పెంపు తప్పలేదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఇంతకూ ఒక్కో సిలిండర్ ధర ఎంత పెరిగిందో తెలుసా?
LPG Cylinder Price Hike : భారత ప్రభుత్వం దేశ ప్రజలపై మరోసారి ఆర్థిక భారం మోపింది. ఇప్పటికే పెరిగిన నిత్యావసర వస్తువులు పేద, మద్యతరగతి ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఇలాంటి సమయంలో సామాన్యుడి వంటింటి ఖర్చును మరింత పెంచింది కేంద్రం... ఇళ్లలో ఉపయోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను పెంచారు. సాధారణంగా ప్రజలు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ పై రూ.50 పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటించారు.
సాధారణ డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లతో పాటు పేదలకు ప్రభుత్వం ఉజ్వల పథకం కింద అందిచిన గ్యాస్ సిలిండర్ ధరలు కూడా రూ.50 పెరిగాయి. దీంతో ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్ కలిగినవారికి ఒక సిలిండర్ ఇప్పటివరకు రూ.500 లభించేది... ఇప్పుడది రూ.550 కానుంది. ఇక సాధారణ డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్ కలిగిన సాధారణ వినియోగదారులకు ఇప్పటివరకు రూ.803 ఒక సిలిండర్ లభిస్తే ఇకపై రూ.853 కు రానుంది.
అయితే ఎల్పిజి గ్యాస్ ధరలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని... ధరలను స్థిరీకరిస్తామని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ తెలిపారు. 2-3 వారాల తర్వాత మరోసారి గ్యాస్ సిలిండర్ ధరలపై సమీక్ష ఉంటుందన్నారు మంత్రి. ఇది ఒక అడుగు మాత్రమేనని... ధరల పెంపు అనివార్యం కావడంవల్లే నిర్ణయం తీసుకున్నామన్నట్లు కేంద్ర మంత్రి కామెంట్స్ చేసారు. పెరిగిన ధరలు ఏప్రిల్ 8 నుండి అంటే రేపట్నుంచే (మంగళవారం) అమలులోకి రానున్నాయి.
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు :
ఇటీవలే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గిన విషయం తెలిసిందే. హోటళ్ళు, రెస్టారెంట్స్ వంటి వాణిజ్య అవసరాలకు ఉపయోగించే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.44 తగ్గించారు. దీంతో బయట హోటల్స్, రెస్టారెంట్స్ లో అహార పదార్థాల ధరలు తగ్గుతాయన్న ఆశలో ఉన్న సామాన్యులకు షాక్ ఇచ్చింది. బయట అహారపదార్థాల ధరల తగ్గడం ఏమోగానీ రోజూ వండుకుని తినడం కూడా మరింత భారం చేసారు. వంటింటి ఖర్చును పెంచి భారం మోపారు.
పెట్రోల్, డిజిల్ పై ఎక్సైజ్ సుంకం పెంపు :
భారత ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై కూడా ఎక్సైజ్ డ్యూటీని పెంచింది. లీటర్ పై ఎక్సైజ్ డ్యూటీని రూ.2 పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో లీటర్ పెట్రోల్ పై ఎక్సైజ్ సుంకం ₹13, లీటర్ డీజిల్ పై ఎక్సైజ్ సుంకం ₹10 కు చేరింది. అయితే ఈ పెంపు భారం వినియోగదారులపై పడదని స్వయంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటించారు.
కొత్త రేట్లు ఏప్రిల్ 8, 2025 నుంచి అమలులోకి వస్తాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్నందున ఈ ఎక్సైజ్ డ్యూటీని కంపెనీలే భరిస్తాయని, రిటైల్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
