పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్న ప్రేమ జంట.. వివాహం జరిగిన గంట వ్యవధిలోనే విడిపోయారు. వివరాల్లోకి వెళితే.. చెన్నైకి చెందిన బాలాజీ వేలూరు జిల్లా గుడియాత్తం మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్నాడు.

సెదుకరై వినాయక వీధికి చెందిన రోజా అదే కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తుంది. సెల్వబాలాజీ, రోజా ఆరు నెలలుగా ప్రేమించుకుంటున్నారు. వీరి వ్యవహారం ఇరు కుటుంబాలకు తెలియడంతో దీనిని వారు వ్యతిరేకించారు.

ఈ క్రమంలో శుక్రవారం బాలాజీ, రోజా యధావిధిగానే ఆఫీసుకు చేరుకున్నారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఘర్షణ ఏర్పడి రోజా బ్లేడుతో తన చేతిని కోసుకుంది. దీంతో ఆమెను పళ్లిగొండలోని రంగనాథర్ ఆలయానికి తీసుకెళ్లి సెల్వ వివాహం చేసుకున్నాడు.

విషయం తెలుసుకున్న కమిషనర్ కుటుంబసభ్యులు సెల్వ బాలాజీని కిడ్నాప్ చేసినట్లు గుడియాత్తం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటు రోజా కుటుంబసభ్యులు కూడా తమ కుమార్తెను కిడ్నాప్ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వివాహానంతరం రోజా, సెల్వ బాలాజీ ఇద్దరూ రోజా ఇంటికి చేరుకున్నారు. దీంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు ఇద్దరిని గుడియాత్తం మున్సిపల్ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఆ సమయంలో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

వెంటనే సెల్వబాలాజీని మాత్రం అతని కుటుంబసభ్యులు వెంటబెట్టుకుని వెళ్లిపోయారు. దీంతో తన భర్తను తనతో పంపాలని రోజా వాగ్వాదానికి దిగింది. విషయం తెలుసుకున్న గుడియాత్తం మహిళా పోలీసులు కమిషనర్ సెల్వబాలాజీని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి.. ఇద్దరి వాదనలు విని నిర్ణయం తీసుకోవాల్సిందిగా సూచించారు.

దీంతో రోజాను వదిలిపెట్టి సెల్వ కుటుంబసభ్యులు కమీషనర్ కారులో చెన్నైకి వెళ్లిపోయారు. అనంతరం రోజాను వారి కుటుంబసభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.