ఐదేళ్లుగా ప్రేమ.. పెళ్లికి నిరాకరించిన యువతి.. నిప్పంటించుకున్న యువకుడు..
ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నా పెళ్లి ప్రతిపాదనకు ఆ యువతి తిరస్కరించింది. దీంతో మనస్థాపం చెందిన ఆ యువకుడు ఆమె ఎదుటే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బీహార్ లోని గయా జిల్లాలో జరిగింది.
ఆ యువతీ యువకులిద్దరూ ఐదేళ్లు ప్రేమించుకున్నారు. కానీ ఏం జరిగిందో ఏమో కానీ ఆ యువతి అతడిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తోంది. కానీ ఆ యువకుడికి తన ప్రేయసి అంటే ప్రాణం. ఆమె ఎన్ని సార్లు తిరస్కరించినా.. మళ్లీ మళ్లీ పెళ్లి ప్రతిపాదన తీసుకునే వస్తున్నాడు. తాజాగా మరో సారి ప్రతిపాదన పెట్టినా.. ఆమె నిరాకరించడంతో శరీరానికి నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది.
వివరాలు ఇలా ఉన్నాయి. ఝార్ఖండ్‌లోని కోడర్మాకు చెందిన 24 ఏళ్ల యువకుడు బీహార్ లోని గయాకు చెందిన యువతి ప్రేమించుకున్నారు. వారి కుటుంబాలు కూడా పరిచయం ఉన్నవే కావడంతో వీరి మధ్య రిలేషన్ షిప్ ఐదేళ్లుగా కొనసాగుతోంది. కానీ వారి ప్రేమను వివాహంగా మార్చుకునేందుకు ఆ యువతి అంగీకరించడం లేదు. పెళ్లి చేసుకుందామని ఆ యువకుడు ఆమెను పలు మార్లు కోరినా.. దానికి ఆమె ఒప్పుకోవడం లేదు.
ఇక లాభం లేదనుకొని ఆ యువకుడు సోమవారం కోడర్మా నుంచి తన ప్రేయసి నివసించే గయాకు వచ్చాడు. అక్కడి నుంచి ఆ యువతి గ్రామమైన డెల్హా పోలీస్‌స్టేషను పరిధి మంద్రాజ్ బిఘా కు చేరుకున్నాడు. పెళ్లి చేసుకుందామని, కలిసి జీవిద్దామని ఆ యువతితో మళ్లీ ప్రతిపాదన పెట్టాడు. కానీ ఎప్పటిలాగే మళ్లీ ఆ యువతి దానిని తిరస్కరించింది. దీంతో ఇద్దరి మధ్య కొంత సేపు వాగ్వాదం చోటు చేసుకుంది. కొంత సమయం తరువాత మనస్థాపానికి గురైన యువకుడు..తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ తో శరీరానికి నిప్పంటించుకున్నాడు.
దీనిపై పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలానికి వచ్చారు. బాధితుడుని హాస్పటల్ కు తరలించారు. ఆ యువకుడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. అయినప్పటికీ అతడు తనను పెళ్లి చేసుకో.. పెళ్లి చేసుకో అని కలవరిస్తున్నాడు. యువకుడు ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.
ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. ఆత్మహత్యతో ఎవరూ ఏమీ సాధించలేరు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వస్తే వెంటనే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726) నెంబర్ కు కాల్ చేయండి. వారు మంచి కౌన్సిలింగ్ ఇచ్చి మీకు సహాయం చేస్తారు.