అదృష్టం లాటరీ రూపంలో ఆ ఇంటి తలుపు కొట్టింది. ఆ  అదృష్టాన్ని అందుకునేలోపే.. చావు రూపంలో దురదృష్టం వాళ్లకు కన్నీరు మిగిల్చింది. ఈ విషాదకర సంఘటన  కేరళలో చోటుచేసుకుంది. లాటరీలో ఓ వ్యక్తికి రూ.60లక్షలు దక్కాయి. వాటిని అందుకునేలోగా.. గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు.

Also Read 

పూర్తి వివరాల్లోకి వెళితే...కేరళ రాష్ట్రం అలప్పుళ జిల్లా మావెలికర గ్రామానికి చెందిన సి.తంబి ఓ దుకాణం నిర్వహిస్తున్నాడు. తంబి ఇటీవల తన దుకాణంలో  స్త్రీ శక్తి’ లాటరీలు తెచ్చి విక్రయించాడు. తన వద్ద ఉన్న లాటరీలన్నీ అమ్ముడుపోగా... పది మాత్రం మిగిలిపోయాయి. కాగా... ఇటీవల లాటరీ బహుమతుల ఫలితాలు వెల్లడించగా.. అతడి వద్ద ఉన్న టికెట్లలో ఒక దానికి రూ.60లక్షలు బహుమతి వరించింది.

అంత మొత్తం లాటరీలో దక్కుతుందని అతను కొంచెం కూడా ఊహించలేదు. దీంతో.. సంతోషంతో ఉబ్బితబ్బిపోయాడు. ఆనందంగా బ్యాంక్ కి వెళ్లి లాటరీ ఇచ్చి రూ.60లక్షలు తెచ్చుకున్నాడు.  వాటిని తమ పిల్లల చదువు కోసం దాచుకున్నాడు కూడా. చేతికి డబ్బులు వచ్చి కొద్ది గంటలు కూడా గడవకముందే.. తంబి గుండె నొప్పితో ప్రాణాలు వదిలాడు.

బ్యాకుంలోనే కుప్పకూలిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా... అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఆనందం తట్టుకోలేక ప్రాణాలు వదిలేసినట్లు తెలుస్తోంది. కాగా... అదృష్టం తమను వరించిందని అనుకునేలోపే.. తమను విషాదం చుట్టుముట్టేసిందని తంబి కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.