మూడు నెలల్లోగా ఫిట్ నెస్ తెచ్చుకోవాలని, లేకపోతే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని వెళ్లిపోవాలని అస్సా పోలీస్ బాస్ ఆ రాష్ట్ర పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి మినహాయింపు ఇస్తామని చెప్పారు.
లావుగా, ఫిట్ నెస్ లేకుండా ఉన్న పోలీసులు మూడు నెలల్లోగా ఫిట్ గా మారాలని, లేకపోతే వీఆర్ఎస్ తీసుకోవాలని అస్సాం డీజీపీ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. ఇది కింది స్థాయి క్యాడెర్ నుంచి ఐపీఎస్ అధికారుల వరకు అందరికీ వర్తిస్తుందని చెప్పారు. త్వరలోనే రాష్ట్ర పోలీసులందరి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎమ్ఐ) ను ప్రొఫెషనల్ గా తయారు చేస్తామని ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ లో వెల్లడించారు.
చనిపోయిన ముస్లిం మహిళను గెలిపించిన ఓటర్లు.. యూపీ మున్సిపల్ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం..
అస్సాంలోని ఐఏఎస్, ఏపీఎస్ అధికారులతో పాటు అస్సాం పోలీసు సిబ్బంది అందరికీ ఫిట్ గా మారడానికి ఆగస్టు 15వ తేదీ వరకు మూడు నెలల సమయం ఇస్తామని తెలిపారు. ఆ తరువాత వచ్చే 15 రోజుల్లో బీఎంఐ ను నమోదు ప్రారంభిస్తామని చెప్పారు. అయితే తరువాత స్థూలకాయ కేటగిరీలో (బీఎంఐ 30+) ఉన్న వారందరికీ బరువు తగ్గడానికి మరో మూడు నెలల సమయం ఇస్తామని చెప్పారు. అయినా కూడా బరువు తగ్గని వారికి ప్రభుత్వ ఆదేశాల మేరకు వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ (వీఆర్ఎస్) ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. హైపోథైరాయిడిజం వంటి నిజమైన వైద్య కారణాలు ఉన్నవారికి మినహాయింపు ఉంటుందని చెప్పారు. ఆగస్టు 16వ తేదీన బీఎంఐ నమోదు చేసుకునే మొదటి వ్యక్తినే తానే అవుతానని డీజీపీ సింగ్ తెలిపారు.
కాగా.. అస్సాంలో సుమారు 70,000 మంది పోలీసు సిబ్బంది పని చేస్తున్నారు. అయితే ఇందులో తాగుడుకు అలవాటు పడిన లేదా ఊబకాయంతో బాధపడుతున్న 650 మందికి పైగా సిబ్బంది జాబితాను ఇప్పటికే రూపొందించారు. వారిలో విధులకు అనర్హులుగా తేలిన వారిని క్షుణ్ణంగా సమీక్షించిన తర్వాత వారికి స్వచ్ఛంద పదవీ విరమణ ఇస్తామని అస్సాం పోలీసు ఉన్నతాధికారులు గత వారం చెప్పారు.
‘‘ఇప్పటికే 680 మంది జాబితా మా వద్ద ఉంది. తార్కిక ఆధారం లేకుండా ఏ పేరును జోడించలేదు. మేము బెటాలియన్లు, జిల్లాల్లో కమిటీలను ఏర్పాటు చేశాం. వాటికి డిప్యూటీ కమాండెంట్ లేదా అదనపు ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వం వహించారు.’’ అని మే 8వ తేదీన డీజీపీ సింగ్ తెలిపారు. అయితే జాబితాలో పేర్లు ఉండి వీఆర్ఎస్ తీసుకోవడానికి ఇష్టపడని వారికి ఫీల్డ్ డ్యూటీలు కేటాయించబోమని సింగ్ స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా.. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఇటీవల పోలీసు ఉన్నతాధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. పోలీసు దళం నుండి తాగుడుకు అలవాటు పడిన వారు, విపరీతమైన స్థూలకాయం ఉన్నవారు, అవినీతి ఆరోపణలు ఉన్నవారని తొలగించాలని ఆదేశించారు. దళాన్ని బాధ్యతాయుతమైన, కార్యాచరణ ఆధారిత దళంగా మార్చాలని చెప్పారు. ‘‘వారికి వీఆర్ఎస్ ఇచ్చే వెసులుబాటు ప్రభుత్వం వద్ద ఉంది. ఇది పాత నిబంధనే అయినా ఇంతకు ముందు అమలు చేయలేదు. ఈసారి దానిపై కసరత్తు ప్రారంభించాం’’ అని హోంశాఖను కూడా నిర్వహిస్తున్న హిమంత్ బిశ్వ శర్మ అన్నారు. వీఆర్ఎస్ ఇచ్చిన వారికి పూర్తి వేతనం అందుతుందని, తరువాత ఖాళీల భర్తీకి కొత్త నియామకాలు చేపడతామని తెలిపారు.
