చనిపోయిందని తెలిసినా ఓ ముస్లిం మహిళకు ఓటేసి ఆమెపై ఉన్న ప్రేమాభిమానాలను వ్యక్తం చేశారు అక్కడి ఓటర్లు. యూపీలోని హసన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో పోటీ చేసిన ఆషియా ఎన్నికలకు ముందే చనిపోయింది. అయినా ఆమె ఎన్నికల్లో గెలుపొందింది.
ఇటీవల యూపీలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఇందులో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. 17 మేయర్ స్థానాలను సొంతం చేసుకుంది. అయితే ఈ ఎన్నికల్లో పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. హిందూ ప్రాబల్యం ఉన్న అయోధ్య ప్రాంతంలో ఓ ముస్లిం అభ్యర్థి విజయం సాధించారు. ఇది వార్తాల్లో నిలిచింది. అయితే తాజాగా మరో విషయం వెలుగులో రావడంతో ఇప్పుడది వైరల్ గా మారింది. ఎన్నికల్లో పోటీ చేసిన ముస్లిం అభ్యర్థి చనిపోయినప్పటికీ.. ఆమెను అక్కడి ఓటర్లు గెలిపించారు.
‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం ప్రకారం.. అమ్రోహా జిల్లాలోని హసన్ పూర్ నగర పాలికలో 30కి పైగా వార్డులు ఉన్నాయి. ఇందులో 17వ వార్డు నుంచి పోటీ చేయాలని 25 ఏళ్ల ఆషియా నిర్ణయించుకుంది. తన వార్డును అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆమె ఏప్రిల్ 16వ తేదీన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆమె భర్త ముంతాజీబ్ అహ్మద్ పాల డెయిరీ నడుపుతుంటాడు. వారిద్దరికీ ఏడాది కిందటే వివాహం జరిగింది.
నామినేషన్ దాఖలు చేయడానికి ముందు ఆషియా తన అభ్యర్థిత్వంపై చర్చించేందుకు ఆ ప్రాంతంలో సమావేశం నిర్వహించింది. రాజకీయాలకు ఆషియా కొత్తే అయినప్పటికీ.. ఆమెలోని నిరాడంబరత, అభివృద్ధి చేయాలనే ధృడ సంకల్పం అక్కడి ప్రజలను ఆకర్శించింది. అందుకే ఆమెకు అందరూ మద్దతు ఇచ్చారు. అయితే ఓటింగ్ కొన్ని రోజుల ముందు ఆమె అనారోగ్యానికి గురైంది. ఊపిరితిత్తులు, పొత్తికడుపు ఇన్ఫెక్షన్ కారణంగా ఆమె ఆరోగ్యం వేగంగా క్షీణించింది. ఏప్రిల్ 20వ తేదీన ఆషియా మరణించింది. అయినప్పటికీ అక్కడి ఓటర్లు ఎన్నికల్లో ఆమెకే ఓటు వేశారు. ఆమెకు ఘన విజయాన్ని అందించారు. ఇటీవల విడుదలైన ఎన్నికల ఫలితాల్లో ఆషియా గెలుపొందారని ఎన్నికల అధికారులు ప్రకటించారు.
కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు..
కానీ ఆ విజయాన్ని ఆస్వాదించేందుకు ఆషియా బతికిలేదు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై హసన్ పూర్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. ఆషియా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారని తెలిపారు. నామినేషన్ వేసిన కొంత కాలానికే ఆమె మరణించారని చెప్పారు. ఆమె పోటీ చేసిన స్థానానికి మే 4వ తేదీన తొలి విడతలో ఎన్నికలు జరిగాయని చెప్పారు. అయితే ప్రజలు ఆమెకు ఓటేసి విజేతగా నిలిపారని చెప్పారు. అయితే తాము నిబంధనలు పాటించాల్సి ఉంది కావున.. ఇప్పుడు మళ్లీ అదే స్థానానికి ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని అన్నారు.
