మణిపూర్ హింసపై విపక్షాల పట్టు: లోక్ సభ 12 గంటల వరకు వాయిదా
మణిపూర్ అంశంపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. దీంతో లోక్ సభ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది.

న్యూఢిల్లీ: మణిపూర్ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబడ్డాయి. శుక్రవారంనాడు లోక్ సభ ప్రారంభమైన వెంటనే విపక్షాలు ఈ అంశంపై చర్చకు పట్టుబడ్డాయి. ఈ విషయమై విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు తమ తమ స్థానాల్లో నిలబడి నిరసనకు దిగారు. ఈ విషయమై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ విపక్షాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో లోక్ సభ ప్రారంభమైన కొద్దిసేపటికే మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా.
లోక్ సభలో విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు నినాదాలు చేయడంపై స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చలే సమస్యకు పరిష్కారమని స్పీకర్ చెప్పారు. నినాదాలు చేస్తున్న విపక్ష పార్టీల ఎంపీలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిన్న కూడ మణిపూర్ అంశంపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. దీంతో లోక్ సభ రెండు దఫాలు వాయిదా పడింది. ఆ తర్వాత కూడ గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో ఇవాళ్టికి లోక్ సభ వాయిదా పడింది.
మణిపూర్ అంశంపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాణికం ఠాగూర్ వాయిదా తీర్మానం ఇచ్చారు. రాజ్యసభలో బీఆర్ఎస్ కూడ వాయిదా తీర్మానం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ కూడ ఇదే అంశంపై వాయిదా తీర్మాన నోటీసు ఇచ్చింది.