Asianet News TeluguAsianet News Telugu

కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం.. అనుమతించిన లోక్‌సభ స్పీకర్

కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు.

Lok Sabha Speaker Om Birla accepts the No Confidence Motion against Government ksm
Author
First Published Jul 26, 2023, 12:29 PM IST

కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతించారు. లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ మంగళవారం అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చారు. అయితే దీనిని అనుమతిస్తున్నట్టుగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. ‘‘నేను అన్ని పార్టీల నాయకులతో చర్చించి.. దీనిని చర్చకు తీసుకోవడానికి తగిన సమయాన్ని మీకు తెలియజేస్తాను’’ అని ఓం బిర్లా లోక్‌సభలో ప్రకటన చేశారు. ఆ తర్వాత మణిపూర్‌పై చర్చ జరిగే సమయంలో ప్రధాని మోదీ సభకు హాజరుకావాలని కోరుతూ ప్రతిపక్ష ఎంపీల నినాదాలు చేయడంతో లోక్‌సభమధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను మణిపూర్ అంశం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. మణిపుర్‌ అంశంపై పార్లమెంటులో ప్రధాని మోదీ సమగ్ర ప్రకటన చేయాలని విపక్ష కూటమి ‘‘ఇండియా’’ పట్టుబుడుతుంది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకురావాలని విపక్ష కూటమి భావించింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎంపీ  ఈరోజు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. మణిపూర్‌లో జరిగిన హింసాకాండతో సహా పలు అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ నుంచి సమాధానం కోరేందుకు లోక్‌సభలో అధికార పార్టీకి సంఖ్యాబలం ఎక్కువగా ఉన్నప్పటికీ అవిశ్వాస తీర్మానం ఒక మార్గమని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. 

ఇదిలా ఉంటే, ‘‘I.N.D.I.A’’ కూటమిలో భాగంగా లేని విపక్ష పార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కూడా సెపరేటుగా అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చింది. మ‌ణిపూర్ అంశంపై కేంద్ర విధానాలు స‌రిగా లేవ‌ని బీఆర్ఎస్ ఆరోపించింది. రూల్ 198(బీ) ప్ర‌కారం లోక్‌స‌భ‌లో అవిశ్వాస తీర్మానం నోటీసు ఇస్తున్న‌ట్లు ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. అయితే సభలో 50 మంది సభ్యులు మద్దతు ఇస్తేనే అవిశ్వాస తీర్మానం పెడతారు. కాంగ్రెస్ తీర్మానానికి అవసరమైన మద్దతు లభిస్తుందని అంచనా వేయగా.. బీఆర్ఎస్‌కు లోక్‌సభలో కేవలం 9 మంది సభ్యులను మాత్రమే కలిగి ఉంది. ఇక, 543 మంది సభ్యులతో కూడిన లోక్‌సభలో ప్రస్తుతం అధికార ఎన్డీయే బలం 331 కాగా..  ప్రతిపక్ష I.N.D.I.A కూటమికి 144 మంది సభ్యులు ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios