వివాదాస్పద ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్‌కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆప్ ఎంపీ సుశీల్ కుమార్ ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు పేపర్లను చించి వెల్‌లోకి విసిరేశారు.
వివాదాస్పద ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు (రాజధాని ప్రాంత ప్రభుత్వ బిల్లు 2023)కి లోక్‌సభ ఆమోదం తెలిపింది. బిల్లుపై విపక్షాలు చర్చించిన అనంతరం .. ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు అమిత్ షా సమాధానం ఇచ్చారు. ఆపై విపక్షాల ఆందోళన మధ్యే వాయిస్ ఓటుతో బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆప్ ఎంపీ సుశీల్ కుమార్ రింక్ ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు పేపర్లను చించి వెల్‌లోకి విసిరేశారు. దీనిపై సీరియస్ అయిన స్పీకర్ ఓం బిర్లా ఆయనను సభ నుంచి సస్పెండ్ చేశారు.
ప్రజల సంక్షేమం కోసమే ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు తీసుకొస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ సేవలు ఎప్పటికీ కేంద్రంతోనే ముడిపడి వున్నాయని అమిత్ షా అన్నారు. ప్రజలకు మంచి చేయడానికి పొత్తులు పెట్టుకోవాలని ఆయన చురకలంటించారు. ఓట్లు, అధికారం కోసం పొత్తులు పెట్టుకోకూడదని.. పొత్తు కోసం మంత్రులు ఏం చేసినా సమర్ధించకూడదని అమిత్ షా అన్నారు. దేశం మంచి కోసం చేస్తున్న చట్టాలను వ్యతిరేకించొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
లోక్ సభలో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును కేంద్రం మంగళవారంనాడు ప్రవేశ పెట్టింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారు.ఈ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.ఆర్టికల్ 249 ప్రకారం ఢిల్లీపై ఎలాంటి చట్టాన్నైనా తీసుకువచ్చే అధికారం ఈ సభకు ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. ఈ బిల్లు ద్వారా నేషనల్ కేపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీని ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వం భావిస్తుంది. ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న విపక్షాలు సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి.
