Asianet News TeluguAsianet News Telugu

ఎడిటర్స్ కామెంట్ : మోడీ ఎక్కడ తగ్గాడు.. రాహుల్ ఎక్కడ నెగ్గాడు

జగన్ కనక చంద్రబాబును అరెస్ట్ చేయకుండా ఉంటే.. పరిస్థితి వేరుగా ఉండేది. ఏపీలో వైసీపీ.. కేంద్రంలో ఇండి కూటమి అధికారంలోకి వచ్చేదేమో!! 

Lok Sabha Election Results 2024: crucial things that helped INDIA bloc hold NDA under 300 seats
Author
First Published Jun 5, 2024, 8:31 AM IST

ఆంధ్రప్రదేశ్‌లో అధికారం ఎవరిది? ఎన్డీయేకి 400 సీట్లు వస్తాయా? ఈ సారి ఎన్నికలంతా  రెండు ప్రశ్నల చుట్టే. ఈ రెండు ప్రశ్నలకూ సమాధానాలూ ఇప్పుడు మనకు తెలుసు. దాదాపు ఇంత దారుణంగా ఉంటాయని ఎవరూ ఊహించి ఉండరు. ఏపీలో జగన్ మట్టికరిచిపోగా.. మూడో సారి 400 సీట్లు గ్యారెంటీ అనుకున్న ఎన్డీయే పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా అయింది. బీజేపీ అధికారానికి కావాల్సిన మెజారిటీకి దూరం కావడంతో.. చంద్రబాబు, నితీశ్ వంటి వారిపై ఆధారపడాల్సిన పరిస్థితి.

మరో ఇంట్రస్టింగ్ పాయింట్ ఏంటంటే.. ఒకవేళ జగన్ కనక చంద్రబాబును అరెస్ట్ చేయకుండా ఉంటే.. పరిస్థితి వేరుగా ఉండేది. ఏపీలో వైసీపీ.. కేంద్రంలో ఇండి కూటమి అధికారంలోకి వచ్చేదేమో!! ఎుందుకంటే 292 సీట్ల అత్తెసరు మెజారిటీతో బతికిబయటపడ్డ ఎన్డీయేకి కేవలం 20 సీట్లు అటు ఇటు అయి ఉంటే ఇద్దరికీ అధికారం దూరమయ్యేదే!! నిద్రావస్థలో ఉన్న టీడీపీ కేడర్‌ను జగన్ చంద్రబాబు అరెస్టుతో తట్టి మరీ నిద్రలేపాడు. తర్వాత పవన్ ఏకమవడం, బీజేపీతో జట్టుకట్టడం తదితర పరిణామాలు తెలిసినవే. బాబు అరెస్ట్ లేకుంటే.. వైసీపీ మరో పది సీట్లు సాధించి ఉన్నా మోదీ పరిస్థితి దారుణంగా ఉండేది. 

Lok Sabha Election Results 2024: crucial things that helped INDIA bloc hold NDA under 300 seats

జగన్ కు మూడు చెరువుల నీళ్లు!!

ప్రతి పక్ష హోదా కూడా లేని జగన్‌కు ఈ అయిదేళ్లు పెద్ద సవాలే. ఒకవైపు  కేంద్రంలో మోదీకి చంద్రబాబు అవసరం చాలానే ఉంది. ఆ అవసరాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు జగన్ అవినీతి కేసులను తెరపైకి తీసుకురావొచ్చు. మొన్నటి దాకా జగన్‌కు 22 ఎంపీ సీట్లు ఉండేవి. దీంతో బీజేపీ కూడా అంతర్గతంగా ఎన్ని ఉన్నా సరే పోనీలే.. అన్న ధోరణి కనబరచింది. చివరకు ఈ ఎన్నికల్లో జగన్, మోదీ ప్లాన్ లో భాగంగానే బీజేపీ.. టీడీపీతో పొత్తు పెట్టుకుంది అన్న ప్రచారమూ జరిగింది. ప్రత్యేక హోదా, ఇతరత్రా అంశాల్లో బీజేపీ ఏపీకి ఆశించినంత మేర ప్రయోజనం చేకూర్చకపోయినా.. జగన్ మోదీని పెద్దగా విమర్శించిది లేదు. కానీ ఇకపై సీన్ అలా ఉండదు. ఇది జగన్ కు కూడా తెలుసు. ఓటమి తర్వాత జగన్ మాటల్లోనూ ఇదే ప్రస్ఫుటించింది.

కళ్లు నెత్తికెక్కితే అంతే!!

వరుసగా మూడోసారి ప్రధాని పీఠమెక్కి జవహర్‌ లాల్‌ నెహ్రూ రికార్డును సమం చేయాలని చూసిన నరేంద్ర మోదీకి ఈ ఎన్నికలు పెద్ద షాక్ ఇచ్చాయి. ముఖ్యంగా హిందీ బెల్టులో పరిస్థితి తారుమారైంది. సమాజ్‌వాదీ పార్టీకి తీవ్ర సవాల్‌ విసిరిన ఉత్తరప్రదేశ్‌తో పాటు రాజస్థాన్‌, హర్యానా రాష్ట్రాల్లో కమలం పార్టీ పరాజయాలను ఎదుర్కొంది. పైగా, దక్షిణాది రాష్ట్రాల్లో ఆశించిన లాభాలు రాబట్టలేకపోయింది. అటు ఇండియా కూటమి గతంలో గెలుచుకున్న వాటికంటే దాదాపు రెట్టింపు స్థానాల్లో పాగా వేసింది.

ఈ న్నికల ఫలితాల్లో బీజేపీ అనుకున్నంత ముందడుగు వేయలేకపోయింది. ఈసారి ఏకంగా 370 సీట్లు సాధిస్తుందన్న బీజేపీకి చుక్కెదురైంది. గతంలో కంటే 60కిపైగా సీట్లు తక్కువ వచ్చాయి. ప్రధానమైన హిందీ బెల్ట్‌లో ఉత్తర్‌ ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర, బిహార్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో బీజేపీ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యూపీలో 80కి గాను 33 స్థానాలకే బీజేపీ పరిమితమైంది.  ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీకి 37 స్థానాలు దక్కాయి. బిహార్‌లో 40కి 12, రాజస్థాన్‌లో 25కి 14 స్థానాలతో సరిపెట్టుకుంది. అటు ఒడిశాలో 21కి 20 స్థానాలను కైవసం చేసుకున్నా... తమిళనాడులో పూర్తిగా చేతులెత్తేసింది. ఫలితంగా బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించలేని పరిస్థితి నెలకొంది. 

దీనంతటకీ కారణం.. దేశానికి మోదీ తప్ప మరో దిక్కు లేదు అని బీజేపీ భ్రమపడటం. వారణాసిలోనూ మోదీకి కొన్ని రౌండ్ల ఫలితాల్లో చుక్కలు కనిపించాయంటే జనం మోదీని ముందులా నమ్మడం లేదని బాగా అర్థం అవుతోంది. రాహుల్‌ గాంధీని చాలా  తక్కువ అంచనా వేసిన బీజేపీ తృటిలో తప్పించుకుంది. మరోవైపు రాహుల్ దేశ వ్యాప్తంగా పాదయాత్రలు చేస్తూ, మిత్ర పక్షాలను కలుపుకుపోతూ ఓటింగ్, సీట్ల షేర్ ను ఇంప్రూవ్ చేసుకోగలిగాడు. 

మొత్తంగా 543 పార్లమెంటు స్తానాల్లో 240 స్థానాలకే బీజేపీ పరిమితమైంది. మ్యాజిక్‌ ఫిగర్‌ 272ను కూడా సొంతంగా తాకలేకపోయింది. అటు, ఇండియా కూటమి 232 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శించింది. కాంగ్రెస్ 99 స్థానాల్లో విజయంతో 2019 కంటే మరింత మెరుగుపడింది. గత ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. బీజేపీ సొంతంగా 303 సీట్లు సాధించగా, NDA ఏకంగా 350 సీట్లను గెలుచుకుంది.

చంద్రబాబు.. నితీశే దిక్కు

ఇక, ఆంధ్రప్రదేశ్, బిహార్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీయే కూటమి చెప్పుకోదగ్గ విజయాన్నందుకుంది. ఏపీలో ఎన్‌డీయే భాగస్వామి పార్టీలు టీడీపీ 16, జనసేన 2 స్థానాల్లో గెలవగా.. బీజేపీ మూడుస్థానాలను గెలుచుకుంది. ఇక, బిహార్ నితీశ్‌ కుమార్‌ పార్టీ జేడీయూ 12 పార్లమెంటు సీట్లు గెలుచుకొని ఎన్‌డీయే ఖాతాలో వేసింది. ఇలా ఎన్‌డీయే 292 స్థానాలు సాధించింది. ఇప్పుడు చంద్రబాబు, నితీశ్ ప్లేటు తిప్పితే.. ఎన్డీయే బలం 262కి పడిపోతుంది. అధికారానికి కావాల్సిన 272 దూరం అవుతాయి.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే... ఇది ప్రజల విజయమని తెలిపారు. ఈ ఎన్నికలను ప్రజలకు, మోదీకి మధ్య జరిగిన యుద్ధంగా అభివర్ణించారు. తన పేరు మీద ఓట్లు వేయాలని కోరిన మోదీకి ఇది పెద్ద ఓటమి అన్నారు. 

Lok Sabha Election Results 2024: crucial things that helped INDIA bloc hold NDA under 300 seats

అటు కాంగ్రెస్‌ అగ్రనేత రాహూల్‌ గాంధీ పోటీ చేసిన రెండుచోట్ల ఘన విజయం సాధించారు. కేరళలోని వయనాడ్‌లో 3,64,422, యూపీలోని రాయ్‌బరేలిలో 3,90,030  ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఈ విక్టరీపై స్పందించిన రాహుల్‌.. ఏ నియోజకవర్గం ఎంపీగా ఉంటారని చాలా మంది అడుగుతున్నారన్నారు. రెండుచోట్లా ఎంపీగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు.

జనం అంత పిచ్చోళ్లా..!!

బీజేపీకి బలం మతం. ఈ పార్టీకి ప్రధాన అజెండా హిందూత్వ. అందుకే ఎన్నికలకు మూడు నెలల ముందే అయోధ్య రామాలయాన్ని ప్రారంభించి.. దీన్ని ఎన్నికలకు ప్రధాన అస్త్రంలా వాడుకోవాలని చూసింది. అయితే జనం ఈ సారి మోదీని అంతగా నమ్మలేదు. వరుసగా మూడో సారి ఎన్డీయే గెలిచిందని చెబుతున్నా.. బీజేపీ మాత్రం మెజారిటీకి దూరమైంది. కశ్మీర్‌కి ప్రత్యేక హోదాను రద్దు చేయడం, పౌరసత్వ సవరణ చట్టం, త్రిపుల్ తలాక్ వంటి బిల్లులను పాస్ చేయడం.. పలు రంగాల్లో అభివృద్ధిని సాధించినా.. జనాల్లోకి మాత్రం అయోధ్య రామ మంత్రంతో ముందుకెళ్లింది. కానీ అక్కడ పాస్ కాలేకపోయింది.

ఇక ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే.. చంద్రబాబును అరెస్ట్ చేయడం, మంత్రుల నోటి దురుసు, మూడు రాజధానులు వంటి  పిచ్చి నిర్ణయాలు, కనిపించని అభివృద్ధి తదితరాలు జగన్ కు శాపంగా మారాయి. ఇలా చెప్పుకొంటే పోతే.. కర్ణుడి చావుకు వంద కారణాలన్నట్లు.. బీజేపీ, వైసీపీ వైఫల్యాలకు బోలెడు రీజన్స్ ఉన్నాయి. మరి చూడాలి వైసీపీ ఎలా బౌన్స్ బ్యాక్ అవుతుందో.!!


- వేణుగోపాల్ బొల్లంపల్లి | ఏసియానెట్ న్యూస్ తెలుగు ఎడిటర్ (Ex. BBC, Big Tv, Microsoft News, Eenadu)

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios