లోక్‌సభలో  విపక్ష సభ్యులు  మణిపూర్ అంశంపై  పట్టుబడ్డారు.  విపక్ష సభ్యుల గందరగోళం మధ్యే లోక్ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు స్పీకర్ . రాజ్యసభ నుండి  విపక్షాలు వాకౌట్ చేశాయి.

న్యూఢిల్లీ: లోక్ సభలో మణిపూర్ హింసతో పాటు ఢిల్లీ ఆర్డినెన్స్ అంశంపై విపక్ష పార్టీల ఎంపీలు బుధవారంనాడు నిరసనకు దిగారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజు నుండి లోక్ సభ, రాజ్యసభలో ఇదే రకమైన పరిస్థితి నెలకొంది. మణిపూర్ అంశంపై ప్రధాని మోడీ ప్రకటన చేయాలని విపక్ష సభ్యులు ఆందోళనలు చేస్తున్నారు. బుధవారంనాడు లోక్ సభ ప్రారంభమైన వెంటనే మణిపూర్ అంశంపై విపక్ష సభ్యులు నిరసనకు దిగారు. ప్లకార్డులు చేతబూని నినాదాలు చేశారు. విపక్ష సభ్యుల మధ్యే ప్రశ్నోత్తరాల సమయాన్ని లోక్ సభ స్పీకర్ కొనసాగించారు. విపక్ష సభ్యుల నినాదాలు కొనసాగిండచంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో లోక్ సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్ . 

మరోవైపు రాజ్యసభలో విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు వాకౌట్ చేశారు. మణిపూర్ అంశంపై చర్చను చేపట్టాలని విపక్ష పార్టీల ఎంపీలు డిమాండ్ చేశారు. రాజ్యసభలో కార్యక్రమాలను సస్పెండ్ చేసి మణిపూర్ అంశంపై చర్చను చేపట్టాలని వారు కోరారు. అయితే దీనికి రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్ కర్ అంగీకరించలేదు. రూల్ 267 కింద 58 నోటీసులు అందాయని చైర్మెన్ తెలిపారు. విపక్ష సభ్యుల నిరసనల మధ్యే ఈ నోటీసులను తిరస్కరించినట్టుగా రాజ్యసభ చైర్మెన్ ప్రకటించారు. దీంతో విపక్ష పార్టీల ఎంపీలు సభ నుండి వాకౌట్ చేశారు.