లక్నో:లాక్‌డౌన్ కారణంగా  భర్త చనిపోతే అంత్యక్రియలు నిర్వహించే లేకపోవడంతో  పోలీసులే అంత్యక్రియలు నిర్వహించిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని గోరక్‌పూర్ కు చెందిన వ్యక్తి ఈ నెల 13వ తేదీన చికెన్ పాక్స్ తో ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో మరణించాడు. లాక్ డౌన్ కారణంగా గోరఖ్‌పూర్ లో ఉన్న కుటుంబసభ్యులు ఢిల్లీకి వచ్చి ఆ మృతదేహాం తీసుకెళ్లే అవకాశం లేకుండాపోయింది. 10 రోజుల పాటు  ఈ డెడ్‌బాడీ ఢిల్లీ మార్చురీలోనే ఉండిపోయింది. 

 డెడ్ బాడీని గోరఖ్‌పూర్ కు పంపించడం వీలు కాకపోతే ఢిల్లీలోనే అంత్యక్రియలు నిర్వహించాలని మృతుడి భార్య లేఖను పంపింది. అంతేకాదు తన భర్త మరణించిన విషయాన్ని ధృవీకరించే రిపోర్టుతో పాటు పోస్టుమార్టం రిపోర్టును కూడ పంపాలని ఆమె ఆ లేఖలో కోరారు. ఈ  లేఖ ఆధారంగా ఢిల్లీ పోలీసులు గురువారం నాడు ఆ వ్యక్తికి హిందూ సంప్రదాయ పద్దతిలో అంత్యక్రియలు నిర్వహించారు.

ఈ లేఖను చూసిన ఢిల్లీ పోలీసులు చలించిపోయారు. ఈ విషయాన్ని డీసీపీ విజయంత ఆర్య చెప్పారు. భర్త అంత్యక్రియలు నిర్వహించాలని ఆమె రాసిన లేఖ చూసి తాను ఎంతో బాధపడినట్టుగా చెప్పారు. మృతుడి కుటుంబసభ్యులకు పోస్టుమార్టం రిపోర్టుతో పాటు డెత్ సర్టిఫికెట్ ను కూడ పోస్టులో పంపుతామని పోలీసులు చెప్పారు.