లాక్ డౌన్ పై మోడీతో సీఎంలు: కేసీఆర్ దారి ఇదీ, వైఎస్ జగన్ దారి వేరే
కరోనా వైరస్ కట్టడికి అమలు చేస్తున్న లాక్ డౌన్ విషయంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఎప్పటిలాగే డౌన్ అమలు చేయాలని కేసీఆర్ అంటుండగా, కొన్ని సడలింపులు అవసరమని జగన్ అన్నారు.
హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి అమలు చేసే లాక్ డౌన్ విషయంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు. శనివారం ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ఈ నెలాఖరు వరకు యథాతథంగా లాక్ డౌన్ ను అమలు చేయాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. దేశమంతా ఒకే విధానాన్ని అనుసరించేలా చూడాలని కేసీఆర్ సూచించారు. అయితే, వైఎస్ జగన్ అభిప్రాయం అందుకు భిన్నంగా ఉంది. కొన్ని షరతులతో లాక్ డౌన్ ను సడలించాలని జగన్ సూచించారు.
Also Read: మాస్కుతో మోడీ దర్శనం: 24 గంటలు అందుబాటులో ఉంటానంటూ సీఎంలకు అభయం
రెడ్ జోన్లకు మాత్రమే లాక్ డౌన్ ను అమలు చేయాలని జగన్ సూచించారు. మీ నాయకత్వం మీద మాకు నమ్మకం ఉందని జగన్ ప్రధానితో అంటూనే ఆర్థిక వ్యవస్థ వేగంగా ముందుకు సాగకపోయినా ప్రజల అవసరాలు తీరే విధంగానైనా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
సినిమా హాళ్లు, మాల్స్, విద్యా సంస్థలు, ప్రజా రవాణ సంస్థవంటి వాటికి లాక్ డౌన్ అమలు చేయాలని జగన్ సూచించారు. మిగతా వాటిని లాక్ డౌన్ నుంచి మినహాయించాలని ఆయన సూచించారు. తాము 1.4 కోట్ల మందికి వైద్యం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. దాదాపు 30 వేల మంది రాష్ట్రంలో వైద్య సేవలు అందిస్తున్నారని, ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలను పెంచుతున్నామని ఆయన చెప్పారు.
కాగా, కేసీఆర్ ఇది వరకే తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. ఆర్థికంగా నష్టపోయినప్పటికీ ప్రజల ప్రాణాలను కాపాడుకోవడానికి లాక్ డౌన్ పొడగించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. యథాతథంగా లాక్ డౌన్ ను అమలు చేయాలని కేసీఆర్ అభిప్రాయంగా కనిపిస్తోంది.
లాక్ డౌన్ అమలుకు ప్రధాని అధ్యక్షతన కేంద్ర మంత్రులతో ఓ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ ప్రదానికి సూచించారు. వ్యవసాయానికి ఆటంకం కలగకుండా చూడాలని, ఉపాధి హామీని వ్యవసాయంతో అనుసంధానం చేయాలని ఆయన సూచించారు. రాష్ట్రాలు కేంద్రానికి చెల్లించాల్సిన అప్పులపై వడ్డీని ఆరు వారాలు వాయిదా వేయాలని ఆయన సూచించారు. మరో రెండు వారాలు లాక్ డౌన్ ను అమలు చేయాలని ఆయన చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ నడిచేలా చూడాలని ఆయన సూచించారు.