న్యూఢిల్లీ: సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసును సీబీఐ విచారణకు ఇవ్వాలని దాఖలైన పిటిషన్ ను గురువారం నాడు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ కేసును పోలీసులను తమ విధులను చేయనివ్వాలని కోర్టు కోరింది.

ఈ కేసు విచారణను సీబీఐకి బదిలీ చేయాలని పలువురు రాజకీయ పార్టీల నేతలు డిమాండ్ చేశారు. అయితే మహారాష్ట్ర హోంమంత్రి అమిల్ దేశ్ ముఖ్ మాత్రం సీబీఐ విచారణకు మాత్రం అంగీకరించలేదు.

ముంబైలో సినీ పరిశ్రమలో ఓ వర్గం అణచివేత కారణంగానే సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో మహారాష్ట్ర, బీహార్ రాష్ట్ర పోలీసులు ఈ కేసుపై విచారణ చేస్తున్నారు.డిప్రెషన్ తో 34 ఏళ్ల సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్  జూన్ 14వ తేదీన ముంబైలోని తన ఫ్లాట్ లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

also read:సుప్రీంకోర్టులో రియా చక్రవర్తి పిటిషన్: సుశాంత్ తండ్రి కేవియట్ దాఖలు

ఈ కేసులో ఇప్పటికే 40 మందిని ముంబై పోలీసులు విచారించారు. సినీ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, ఆదిత్య చోప్రా, శేఖర్ కపూర్, సుశాంత్ స్నేహితురాలు రేఖ చక్రవర్తితో పాటు అతని సహ నటులు, డాక్టర్లను విచారించారు.

2013 లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్  కై పో చే అనే సినిమా ద్వారా సినీ రంగంలో అడుగుపెట్టారు. పికె, ఎంఎస్ ధోని, ది అన్ లోల్డ్ స్టోరీ, కేదార్ నాథ్, సోంచిరియా వంటి పలు సినిమాల్లో ఆయన నటించారు. సుశాంత్ నటించిన చివరి సినిమా దిల్ బెచారా గత వారం రికార్డు సృష్టించింది.