ఇదేందయ్యా ఇదీ... చిరుతపులి ఇంత ఈజీగా ఇరుక్కుపోయిందే...!
చాలాకాలంగా స్థానికులను భయపెడుతున్న చిరుతపులి దానంతట అదే బోనులో చిక్కిన ఘటన కేరళలో వెలుగుచూసింది. అది ఎలాగంటే...
కేరళ : జనావాసాల్లోకి ప్రమాదకర అడవి జంతువులు వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలకాలంలో చిరుత పులులు అడవుల్లోంచి బయటకు వచ్చి మనుషులపై దాడిచేయడం... లేదంటే అవి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్న ఘటనలు అనేకం వెలుగుచూసాయి. తాజాగా కేరళలో కూడా ఇలాగే జనావాసాల్లోకి వచ్చిన చిరుత ప్రమాదాన్ని కొనితెచ్చుకుంది. కానీ వెంటనే స్థానికులు స్పందించి అటవీ అధికారులకు సమాచారం అందించడంతో చిరుత ప్రాణాలు దక్కాయి.
వివరాల్లోకి వెళితే... కేరళలోని పలక్కాడ్ జిల్లా కొంతకాలంగా చిరుత సంచారం కలకలం రేపుతోంది. చిరుతకు భయపడి రైతులు, వ్యవసాయ కూలీలు పొలంపనులకు వెళ్లేందుకు భయపడిపోతున్నారు. ముఖ్యంగా కొల్లెన్గొండె సమీపగ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది చిరుత. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంత ప్రజలు భయంభయంగానే బ్రతుకుతున్నారు.
అయితే ఎలాంటి ప్రయత్నం లేకుండానే చిరుత పట్టుబడింది. ఓ రైత పొలం చుట్టూ వేసుకున్న కంచెలో చిరుత చిక్కుకుంది. దాని శరీరాన్ని ఇనుప కంచె చుట్టేయడంతో ఏటూ కదల్లేకపోయింది. చిరుతను గమనించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు చిరుతను సురక్షితంగా కాపాడారు.
చాలాకాలంగా తమను భయపెడుతున్న చిరుత పట్టుబడటంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇకపై తాము ఎలాంటి భయం లేకుండా వ్యవసాయ పనులు చేసుకుంటామని రైతులు అంటున్నారు. ప్రస్తుతం అటవీ అధికారుల పర్యవేక్షణలో చిరుత వుంది... దాన్ని సురక్షిత ప్రాంతంలో వదిలిపెడతామని అటవీ అధికారులు చెబుతున్నారు.