కర్ణాటకలో గురువారం వేర్వేరు ఘటనల్లో ఇద్దరు చిరుతపులుల బారిన పడ్డారు. తుమకూరు, కొప్పళ జిల్లాల్లో చిరుతల దాడుల్లో ఒక మహిళ, ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయారు. తుమకూరు జిల్లా, హోబళి మణికుప్ప గ్రామంలో 48 ఏళ్ల భాగ్యమ్మ చిరుత చేతిలో మృత్యువాత పడింది. 

ఉదయం పశువులను తన పొలానికి తోలుకెళ్లింది భాగ్యమ్మ. ఈ సమయంలో ఎక్కడి నుంచో వచ్చిన ఓ ఆమె మీద పడి గొంతు కొరికేసింది. అది గమనించిన పక్క పొలాల్లోనివారు గట్టిగా కేకలు వేస్తూ రావడంతో చిరుత పరారైంది. అప్పటికే ఆమె కన్నుమూసింది. ఈ ప్రాంతంలో పలుమార్లు చిరుత దాడులు జరుగుతున్నా అటవీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామస్తులు మండిపడ్డారు.      

మరో ఘటనలో గంగావతి తాలూకాలోని ఆనెగుంది సమీపంలో గోశాల వద్ద నిద్రిస్తున్న ఓ యువకునిపై చిరుతపులి దాడిచేసింది. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. దేవస్థానంలో వంట పని, గోశాల పశువులను చూసుకునే హులిగప్ప(23) అనే యువకుడు గోశాల వద్ద నిద్రిస్తుండగా చిరుత దాడి చేసింది. 

అతన్ని నోట కరుచుకుని గుహలోకి తీసుకెళ్లి చంపి గొంతు, కుడి కాలు తొడను తినేసింది. ఇటీవల చిరుత బెడద ఎక్కువై నెల రోజుల్లోనే ఇద్దరు మహిళలతో పాటు ఇదే దేవస్థానం వద్ద హైదరాబాద్‌కు చెందిన బాలుడిపై చిరుత దాడి చేసిన ఘటనలు జరిగాయి. కొప్పళ ఎంపీ కరడి సంగణ్ణ ఘటనాస్థలాన్ని పరిశీలించి రూ.7 లక్షల పరిహారం ఇప్పిస్తామని కుటుబ సభ్యులకు హామీ ఇచ్చారు.