దంపతులపై దాడి చేసి.. చిన్నారిని ఎత్తుకెళ్లిన చిరుత

Leopard Attacks Couple On Motorcycle, Takes Away Infant In Gujarat
Highlights

వెనుక కూర్చున్న సప్నను మోకాలిపై గాయపరిచి.. ఆమె చేతుల్లోని పసికందును నోటకరుచుకుని వెళ్లిపోయింది. ఈ ఊహించని పరిణామంతో భయాందోళనకు గురైన విక్రమ్‌, సప్నలు పెద్దపెద్దగా కేకలు వేస్తూ సాయం కోసం అరిచారు. 

బైక్ పై వెళ్తున్న ఇద్దరు దంపతులపై దాడి చేసి.. వారి వద్ద ఉన్న చిన్నారిని ఓ  చిరుత ఎత్తుకెళ్లింది. అయితే అదృష్టవశాత్తు ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు. గుజరాత్‌లోని వడోదర సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..

ఛోటా ఉదయ్‌పూర్‌ జిల్లాకు చెందిన విక్రమ్‌ రత్వా గత శనివారం రాత్రి తన భార్య సప్న, నాలుగు నెలల కుమారుడితో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. రాయ్‌పూర్‌ గ్రామానికి రాగానే ఓ చిరుతపులి వారిపై దాడి చేసింది. సమీపంలోని పొలాల నుంచి రోడ్డు మీదకు వచ్చిన చిరుత విక్రమ్‌ కుటుంబంపై ఒక్కసారిగా దాడికి దిగింది. వెనుక కూర్చున్న సప్నను మోకాలిపై గాయపరిచి.. ఆమె చేతుల్లోని పసికందును నోటకరుచుకుని వెళ్లిపోయింది.

ఈ ఊహించని పరిణామంతో భయాందోళనకు గురైన విక్రమ్‌, సప్నలు పెద్దపెద్దగా కేకలు వేస్తూ సాయం కోసం అరిచారు. వీరి అరుపులు విన్న గ్రామస్థులు వెంటనే అక్కడకు చేరుకుని చిరుతపులిని వెంబడించారు. దానిని భయపెట్టే ప్రయత్నం చేశారు. అదృష్టవశాత్తు కాసేపటికి ఆ చిన్నారిని వదిలేసి చిరుత అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనలో చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటన అనంతరం చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు.

loader