ఇండియా కూటమికి వామపక్షాల దెబ్బ? బెంగాల్, కేరళలో డీల్‌కు నో!
విపక్ష శిబిరం ఇండియా కూటమికి వామపక్షాలు దెబ్బతీసేలా ఉన్నాయి. బెంగాల్, కేరళలో విపక్ష కూటమి డీల్‌కు లెఫ్ట్ అంగీకరించేలా లేదు. బెంగాల్, కేరళలోనూ విపక్ష సభ్య పార్టీలపైనే పోటీకి సిద్ధం కాబోతున్నట్టు తెలుస్తున్నది.

న్యూఢిల్లీ: విపక్షాల కూటమికి వామపక్షాల దెబ్బ పడే అవకాశం ఉన్నది. పశ్చిమ బెంగాల్, కేరళలో కూటమికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ రెండు రాష్ట్రాల్లో సీపీఎం బలంగా ఉన్నది. ఇక్కడ ఇండియా కూటమి పార్టీలతోనే తలపడాల్సి ఉన్నది. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, కేరళలో కాంగ్రెస్ ఫ్రంట్‌తో పోటీ పడాల్సి ఉన్నది.
దీనికి అదనంగా విపక్షాల ఐక్యత సమన్వయ కమిటీ సమావేశాలకు సీపీఎం తన ప్రతినిధిని ప్రకటించకూడదనే నిర్ణయం కూడా తీసుకున్నట్టు సమాచారం. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు రెండింటికీ దూరం పాటించాలని సీపీఎం నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఈ పరిణామం విపక్ష శిబిరంలోని విభేదాలను, లోపాలను ఎత్తిచూపిస్తున్నది.
ఢిల్లీలో గత వారాంతంలో సీపీఎం పోలిట్ బ్యూరో సమావేశమైంది. ఈ భేటీలోనే కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు కొన్ని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఇండియా సమన్వయ కమిటీ సమావేశం గత వారం జరిగింది. ఈ సమావేశానికి సీపీఎం పార్టీ నుంచి ఎవరూ హాజరు కాలేదు. 14 సభ్యుల ఆ కమిటీ సమావేశంలో సీపీఎం సీటు ఖాళీగానే ఉన్నది. వామపక్షాల నిర్ణయం విపక్ష శిబిరానికి మింగుడుపడకపోవచ్చును.. గానీ, మమతా బెనర్జీకి పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే ఈ శిబిరంలోనూ వామపక్షాలతో వేదిక పంచుకోవడానికి ఆమె వెనుకాముందాడారు.
Also Read: ప్రజలు సంబరాలు చేసుకోలేదు.. పార్లమెంట్‌లో ఏపీ విభజన అంశాన్ని ప్రస్తావించిన ప్రధాని మోదీ
పొలిట్ బ్యూరో ప్రకటనలో విపక్ష శిబిర సంఘటితం, విస్తరణకు కృషి చేస్తామని తెలిపింది. భారత లౌకిక, భారత రిపబ్లిక్ స్వభావం, రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ప్రజల ప్రాథమిక హక్కులు, పౌర బాధ్యతలను కాపాడటానికి విపక్ష శిబిరాన్ని బలోపేతం చేయడానికి పని చేస్తామని వివరించింది. ఇది జరగాలంటే కేంద్రంలో బీజేపీ ఉండకూడదని, రాజ్యాధికారానికి దూరం చేయాలని తెలిపింది. ఇందుకోసం సీపీఎం మరింత పాటుపడుతుందని పేర్కొంది. పాట్నా బెంగళూరు, ముంబయి సమావేశాల్లో పార్టీ వైఖరిని సమర్థించుకుంది.
మధ్యప్రదేశ్‌లో కమల్ నాథ్ ఇండియా ర్యాలీని వద్దని నిర్ణయం తీసుకున్న తర్వాత సీపీఎం పై నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం. మధ్యప్రదేశ్‌లో ఇండియా కూటమి సభ్యపార్టీ ఆప్ అభ్యర్థులను ప్రకటిస్తున్నప్పుడు ఇండియా ర్యాలీకి అర్థం లేదని కమల్ నాథ్ తెలిపారు. ఇండియా కూటమిపై ఇది వరకే చాలా అనుమానాలు ఉన్నాయి. కూటమికి ముఖ్యమైన నిబంధనలపై, ఫార్ములాపై ఇంకా కసరత్తు జరుగుతూనే ఉన్నది. ఈ సందర్భంలోనే సభ్య పార్టీలు కూటమికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడంతో ఈ విపక్ష శిబిరంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.