Agartala: త్రిపురలో వామపక్షాలు (లెఫ్ట్ పార్టీల నాయకులు) , కాంగ్రెస్ ఏంపీలపై దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాంతంలో భద్రతా బలగాలను మోహరించి దాడికి పాల్పడి, పరారీలో ఉన్న ఇతరులను పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
Three arrested over attack on Left, Congress MPs: ఈశాన్య భారత రాష్ట్రమైన త్రిపురలో వామపక్షాలు (లెఫ్ట్ పార్టీల నాయకులు) , కాంగ్రెస్ ఏంపీలపై దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదుచేసుకున్న పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాంతంలో భద్రతా బలగాలను మోహరించి దాడికి పాల్పడి, పరారీలో ఉన్న ఇతరులను పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
వివరాల్లోకెళ్తే.. సెపాహిజాలా జిల్లాలో వామపక్షాలు (లెఫ్ట్ పార్టీల నాయకులు), కాంగ్రెస్ పార్లమెంటరీ ప్రతినిధుల బృందంపై జరిగిన దాడికి సంబంధించి ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. ఆ ప్రాంతంలో భద్రతా బలగాలను మోహరించి సీనియర్ అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. బిషాల్ గఢ్ సబ్ డివిజన్ సరిహద్దు గ్రామమైన నేహల్ చంద్రనగర్ లో శుక్రవారం ఎన్నికల అనంతర హింసాకాండ ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తున్న వామపక్ష, కాంగ్రెస్ ఎంపీలతో కూడిన ప్రతినిధి బృందంపై దాడి జరిగింది. ఇప్పటివరకు ముగ్గురిని అరెస్టు చేశామనీ, దాడికి పాల్పడిన మిగతా వారిని పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
ఆ ప్రాంతంలో భద్రతా బలగాలను మోహరించామనీ, సీనియర్ అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి మాణిక్ సాహా.. డీజేపీ అమితాబ్ రంజన్ తో మాట్లాడారని, నిందితులందరినీ వారి రాజకీయాలకు అతీతంగా అరెస్టు చేయాలని కోరారని మరో అధికారి తెలిపారు. పశ్చిమ త్రిపుర, సెపాహిజాలా, ఖోవాయ్ లోని వివిధ హింసాత్మక ప్రాంతాల్లో వామపక్షాలు, కాంగ్రెస్ ల సంయుక్త బృందం శుక్రవారం పర్యటిస్తోందని సీపీఐ(ఎం) తెలిపింది. సీపీఎం ఎంపీ ఇ.కరీం, కాంగ్రెస్ ఎంపీ అబ్దుల్ ఖలిక్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అజయ్ కుమార్ లతో కూడిన ప్రతినిధి బృందం నేహల్ చంద్రనగర్ మార్కెట్ కు చేరుకోగానే 'భారత్ మాతాకీ జై' నినాదాలతో దుండగులు వారిపై దాడి చేశారు. ఒక వాహనం తీవ్రంగా ధ్వంసమవగా, మరో రెండు కార్లు కూడా ధ్వంసమయ్యాయని సీపీఎం సీనియర్ నేత రాఖల్ మజుందార్ తెలిపారు. ఈ ప్రాంతంలో బుధవారం రాత్రి 20 దుకాణాలకు నిప్పుపెట్టారు.
ఈ దాడిలో బృందంలోని ఎనిమిది మంది సభ్యుల్లో పెద్దగా ఎవరూ గాయపడలేదని, వామపక్షాలు, కాంగ్రెస్ నేతలతో వెళ్తున్న రెండు, మూడు వాహనాలను ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ బృందం మార్చి 12 వరకు రాష్ట్రంలోనే ఉంటుందనీ, ఆ తర్వాత నివేదిక సమర్పిస్తుందని, ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతామని సీపీఐ ఎంపీ బినోయ్ విశ్వం తెలిపారు. ఎన్నికల అనంతర హింసాత్మక కేసుల్లో అత్యధికంగా సెపాహిజాలా, ఖోవాయ్ జిల్లాల్లో నమోదయ్యాయి. స్వార్థ ప్రయోజనాలతో కూడిన కొందరు రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారనీ, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి మాణిక్ సాహా పోలీసులను ఆదేశించారు. మార్చి 2న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ-ఐపీఎఫ్టీ ప్రభుత్వం వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది.
