కేసు ఫైల్ లేకుండా వచ్చే లాయర్ ను చూస్తే.. 'సచిన్ టెండూల్కర్ బ్యాట్ లేకుండా ఆడేందుకు మైదానంలోకి వచ్చినట్లు అనిపిస్తోందని సీజేఐ డీవై చంద్రచూడ్ అన్నారు. కేసు ఫైల్‌ను చదివిన తర్వాతే కోర్టుకు హాజరు కావాలని యువ న్యాయవాదికి సూచించారు.
సుప్రీంకోర్టు: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ ఓ కేసు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రీఫ్ లేని లాయర్ బ్యాట్ లేని సచిన్ టెండూల్కర్ లాంటివాడని, బ్రీఫ్(కేసు ఫైల్)లేకుండా కోర్టు హాజరైన ఓ న్యాయవాదిని సీజేఐ డీవై చంద్రచూడ్ మందలించింది. శుక్రవారం నాడు భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) DY చంద్రచూడ్ , జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం ఓ కేసును విచారిస్తున్న సమయంలో కేసు ఫైల్ లేకుండా ఓ న్యాయవాది కోర్టుకు హాజరుకావడాన్ని గమనించి.. వెంటనే అతనికి చురకలు అంటించింది. కొందరి న్యాయవాదుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఈ సమయంలో CJI DY చంద్రచూడ్ మాట్లాడుతూ.. “బ్రీఫ్ లేని లాయర్ బ్యాట్ లేని సచిన్ టెండూల్కర్ లాంటివాడు. ఇది సరైన పద్దతి కాదు. మీరు గౌను మరియు బ్యాండ్ (కాలర్)లో ఉన్నారు, కానీ మీ వద్ద బ్రీఫ్ ( కేసు పేపర్లు) లేవు అని అన్నారు. ఏ పేపర్ కూడా పెట్టుకోకుండా బ్యాండ్, గౌను ధరించడం అన్యాయమని సీజేఐ అన్నారు. అలాగే మీ కేసు పేపర్లను ఎల్లప్పుడూ మీ దగ్గర ఉంచుకోవాలని సూచించారు. కోర్టుకు వచ్చినప్పుడల్లా కేసు ఫైళ్లను చదువుకోవాలని సూచించారు.
అంతకు ముందు .. సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమావేశమైన సీజేఐ చంద్రచూడ్..పెండింగ్‌ను తగ్గించేందుకు కోర్టు సమయాన్ని సరిగా ఉపయోగించుకోవాలని, సుప్రీం కోర్టులోని మొత్తం 13 బెంచ్‌లు సూచిస్తూ.. ప్రతి బెంచ్ రోజు 10 వివాహ వివాదాలకు, 10 బెయిల్ పిటిషన్‌లను విచారించాలని పేర్కొన్నారు. కోర్టు పూర్తిస్థాయి సమావేశం అనంతరం ఆయన మట్లాడుతూ.. ప్రతి బెంచ్ శీతాకాలపు విరామానికి ముందు రోజుకు 10 బదిలీ పిటిషన్లను స్వీకరించాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.
