ప్రేమను ఒప్పుకోలేదని ఓ లాయర్ దారుణానికి ఒడిగట్టాడు. తన ప్రేమను నిరాకరించిందని తన దగ్గర ఇంటర్న్ షిప్ చేసిన మహిళా లాయర్ మీద దాడి చేశాడు.
ఉత్తరాఖండ్ : బాధ్యతాయుతమైన న్యాయవాద వృత్తిలో ఉండి.. అత్యంత దారుణంగా వ్యవహరించాడో లాయర్. క్షణికావేశంలో, ఉద్రేకంలో వ్యవహరించే టీనేజర్లలాగా ప్రవర్తించాడు. తన ప్రేమను ఒప్పుకోలేదని ఏకంగా ఓ మహిళా న్యాయవాది ముక్కును కొరికేశాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో చోటుచేసుకుంది. దీని మీద ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. 2018లో సదరు బాధితురాలు లాయర్ చంద్రశేఖర్ దగ్గర ఇంటర్న్ షిప్ చేసింది.
ఈ క్రమంలోనే చంద్రశేఖర్ ఆమెను ప్రేమిస్తున్నానని తెలిపాడు. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని అన్నాడు. ఈ మేరకు బాధితురాలిని చంద్రశేఖర్ కోరాడు. కానీ ఆమె దీనికి తనకు ఇష్టం లేదని నిరాకరించింది. అయినా కూడా నిందితుడైన చంద్రశేఖర్ ఆమెను వేధిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం కోర్టు ఆవరణలో హోలీ వేడుకలు జరిగాయి. దీనికి బాధితురాలుతోపాటు.. లాయర్ చంద్రశేఖర్ కూడా హాజరయ్యాడు.
రక్తమోడిన దేశ రాజధాని రహదారులు.. అదుపు తప్పిన కారు.. ఇద్దరు మృతి, పలువురి పరిస్థితి విషమం..
సాయంత్రానికి వేడుకలు ముగిసాయి. ఎక్కడి వాళ్ళు అక్కడికి బయలుదేరారు. ఆ సమయంలో బాధితురాలు కోర్టు నుంచి ఇంటికి బయలుదేరి వెళుతుండగా, బాధితురాలు స్కూటీకి చంద్రశేఖర్ అడ్డుగా వెళ్ళాడు. ఆమెను ఆపి.. తనను పెళ్లి చేసుకోవాలంటూ మరోసారి ఒత్తిడి చేశాడు. దీనికి ఆమె ముందరలాగా నిరాకరించింది. దీంతో చంద్రశేఖర్ విపరీతమైన కోపానికి లోనయ్యాడు. ఆమె మీద దాడి చేసి, ముక్కుకొరికేశాడు. ఆ తర్వాత అతని నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేసింది.
ఇదిలా ఉండగా, మార్చి 2న వీధికుక్కలు ఓ వృద్ధురాలి ముక్కు కొరికి గాయపరిచాయి. తెలంగాణలో కుక్కల దాడుల ఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి. చిన్నారులపైనే కాదు వృద్ధులపై కూడా కుక్కలు దాడులు చేస్తున్న ఘటనలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెంకటాపురంలో వెలుగు చూసిన ఓ ఘటన కలకలం రేపింది. శీలం రాంబాయమ్మ అనే వృద్ధురాలి మీద కుక్కలు దాడి చేశాయి. ఆమె ఇంటి ముందు కూర్చుని ఉండగా ఒక కుక్క దాడి చేసి ముక్కుపై తీవ్రంగా కరిచింది.
ఈ హఠాత్పరిణామానికి ఆమె గట్టిగా కేకలు వేయడంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కుక్కను అదిలించి.. ఆమెను చికిత్స కోసం వరంగల్ లోని ఎంజీఎం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. రాంబాయమ్మ మీదే కాదు అదే గ్రామంలో మరో నలుగురు మీద కూడా కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. పశువుల మీద కూడా కుక్కలు దాడి చేసి గాయపరుస్తున్నాయి. కుక్కల దాడిలో గాయపడిన వారిలో శీలం సమ్మన్న, జ్యోతిలు కూడా ఉన్నారు.
