కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు క్షమాపణలు చెప్పాలని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ డిమాండ్ చేశారు. రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జీలు కొందరు యాంటీ ఇండియా గ్యాంగ్‌లో చేరిపోయారని, సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరకంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారని  తీవ్ర ఆరోపణలు చేశారు.  

న్యూఢిల్లీ: కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెంటనే దేశానికి క్షమాపణలు చెప్పాలని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ డిమాండ్ చేశారు. కొందరు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులు యాంటీ ఇండియాగా మారారని చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఇలా వ్యాఖ్యానించడం సిగ్గుచేటు అని అన్నారు. 

కిరణ్ రిజిజు లక్ష్మణ్ రేఖ దాటకూడదని, ఆయన న్యాయ శాఖ మంత్రిగా బాధ్యతల్లో ఉండి కూడా అన్ని హద్దులను దాటాడని సౌరభ్ భరద్వాజ్ అన్నారు. దేశ వ్యాప్తంగా సర్వే చేస్తే ప్రజల విశ్వాసమున్న ఏకైక వ్యవస్థ సుప్రీంకోర్టు అనే తేలుతుందని చెప్పారు. 

కిరణ్ రిజిజు ఓ పబ్లిక్ ఈవెంట్‌లో మాట్లాడుతూ కొందరు రిటైర్డ్ జడ్జీలు యాక్టివిస్టులుగా మారారని పేర్కొన్నారు. యాంటీ ఇండియా గ్యాంగ్‌లో చేరారని తీవ్ర ఆరోపణలు చేశారు. తద్వార వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టును మార్చే కుతంత్రం చేస్తున్నారని ఆరోపణలు చేశారు.

ఈ ఆరోపణలపైనే ఆప్ లీడర్ సౌరభ్ భరద్వాజ్ పై విధంగా రియాక్ట్ అయ్యారు. అంతేకాదు, బీజేపీ మంత్రులు, కిరణ్ రిజిజులు పబ్లిక్ ప్లాట్‌ఫామ్స్‌లో ఎలా మాట్లాడాలో సీజేఐ డీవై చంద్రచూడ్‌ను చూసి నేర్చుకోవాలని సూచించారు. జడ్జీలు పబ్లిక్‌గా ప్రసంగించాల్సిన అవసరం లేదని, కానీ, సీజేఐ చంద్రచూడ్ పబ్లిక్ ఫోరమ్‌లో ఎంతో సమతుల్యతతో మాట్లాడుతారని ప్రశంసించారు. ముఖ్యంగా కిరణ్ రిజిజు ఆయనను చూసి... ఎలా హద్దుల్లోనే ఉండి మాట్లాడాలో నేర్చుకోవాలని పేర్కొన్నారు.

Also Read: కేసీఆర్‌ ను కట్టడి చేయాలనే కవిత పై కేసులు.. బీజేపీ పై మంత్రి ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

న్యాయ మూర్తులను కేంద్ర ప్రభుత్వం ఎలా నియమిస్తుంది? అని ప్రశ్నించారు. నేడు రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఇబ్బందులు పెడుతున్నదని, అదానీ కేసు కూడా ఉన్నదని అన్నారు. ఇలాంటి కేసుల్లో కేంద్ర ప్రభుత్వమే కోర్టు ముందు నిలబడి వివరణ ఇవ్వాల్సి ఉంటుందని, అలాంటి కేంద్రం న్యాయమూర్తులను ఎలా నియమిస్తుందని అడిగారు. సాంప్రదాయ విషయాల్లో బీజేపీ నేతలు అనవసరంగా సీజేఐ విషయంలో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు.