New Delhi: ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణంలో తేజస్వీ యాదవ్ సీబీఐ ఎదుట విచారణకు హాజర‌య్యారు. ఉదయం 10.30 గంటలకు సీబీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న ఆయ‌న అవసరమైన అన్ని ప్ర‌క్రియ‌లు పూర్తయిన తర్వాత దర్యాప్తు బృందం విచార‌ణ‌కు తీసుకెళ్లింది. 

Land-For-Jobs Scam: ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం కేసులో బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ ఢిల్లీలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఎదుట విచారణకు హాజరయ్యారు. ఉదయం 10.30 గంటలకు సీబీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేతను అవసరమైన అన్ని ప్ర‌క్రియ‌లు పూర్తయిన తర్వాత దర్యాప్తు బృందం విచార‌ణ‌కు తీసుకెళ్లింది. ఢిల్లీ హైకోర్టులో తేజస్వీ యాదవ్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా, ఆయనను ఈ నెలలో అరెస్టు చేయబోమని సీబీఐ తెలిపిన త‌ర్వాత ఆయ‌న విచార‌ణ రావ‌డం గ‌మ‌నార్హం. కాగా, ప్రస్తుతం జరుగుతున్న బీహార్ అసెంబ్లీ సమావేశాలు ఏప్రిల్ 5న ముగియనున్నందున విచారణకు హాజరయ్యేందుకు కొంత సమయం కావాలని యాదవ్ ఫెడరల్ ఏజెన్సీకి తెలియజేసినట్లు ఆర్జేడీ నేత తరఫు న్యాయవాది మణిందర్ సింగ్ తెలిపారు.

అయితే, శనివారం అసెంబ్లీ సమావేశమవడం లేదని, యాదవ్ తన సౌలభ్యం మేరకు మార్చిలో ఏ శనివారమైనా విచారణకు హాజరుకావచ్చని సీబీఐ తరఫు న్యాయవాది డీపీ సింగ్ కోర్టుకు తెలిపారు. తనపై ఫిబ్రవరి 28, మార్చి 4, మార్చి 11 తేదీల్లో జారీ చేసిన సమన్లను రద్దు చేయాలని ఆర్జేడీ నేత కోరారు. ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం కేసులో తేజ‌స్వీ యాదవ్ తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్, తల్లి రబ్రీదేవి (బిహార్ మాజీ ముఖ్యమంత్రులు), సోదరి మీసా భారతి తదితరులకు మార్చి 15న సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మొదటి ఛార్జీషీట్ దాఖలు చేసిన తర్వాత బయటపడిన డాక్యుమెంట్లు, సాక్ష్యాధారాలు, ప్రాథమిక నివేదిక దాఖలు చేసే సమయానికి పూర్తికాని నిందితుల పాత్రపై జరుగుతున్న దర్యాప్తులో భాగంగానే యాదవ్ కుటుంబం, ఇతరులపై సీబీఐ దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

దర్యాప్తు సందర్భంగా సేకరించిన తాజా సమాచారం ఆధారంగా తదుపరి దర్యాప్తులో భాగంగా నిందితులను కొత్తగా విచారిస్తున్నామని సీబీఐ అధికారులు తెలిపారు. 2004 నుంచి 2009 వరకు యూపీఏ ప్రభుత్వంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఎలాంటి ప్రకటన, పబ్లిక్ నోటీసు లేకుండా నిబంధనలు, విధివిధానాలను ఉల్లంఘించి తమకు ఇష్టమైన అభ్యర్థులను రైల్వేలో నియమించారని సీబీఐ ఆరోపించింది. ముంబ‌యి, జబల్ పూర్, కోల్ కతా, జైపూర్, హజీపూర్ లలో ఉన్న వివిధ జోనల్ రైల్వేల్లో ఈ నియామ‌కాలు జ‌రిగిన‌ట్టు ద‌ర్యాప్తు ఏజెన్సీ పేర్కొంది. దీనికి ప్రతిఫలంగా అభ్యర్థులు నేరుగా లేదా వారి కుటుంబ సభ్యుల ద్వారా లాలూ ప్రసాద్ యాద‌వ్ కుటుంబ సభ్యులకు అధిక రాయితీ ధ‌ర‌లకు భూములను విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి.