ఢిల్లీ: ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవి, తనయుడు తేజస్వి యాదవ్‌కు ఊరట లభించింది. 

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులందరికీ పటియాల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిందితులు ఒక్కొక్కరు   రూ.లక్ష రూపాయలు బాండ్, మరో లక్ష రూపాయలు ష్యూరిటీ  ఇవ్వడంతో కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.
 
ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ కుంభకోణం కేసుకు సంబంధించి ఉదయం 10 గంటలకు పటియాల కోర్టు విచారణ ప్రారంభించింది. ఈ కేసులో సీబీఐ  నిందితులుగా పేర్కొన్న రబ్రీదేవి, ఆమె కుమారుడు తేజస్వి యాదవ్ పటియాలా హౌస్ కోర్టు ముందు హాజరయ్యారు. 

తేజస్వి, రబ్రీలతో సహా నిందితులు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో వీరికి కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ విచారణను వాయిదా వేసింది. రాంచీలో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నందున లాలూ ప్రసాద్ యాదవ్ కోర్టు విచారణకు హాజరుకాలేదు.
 
లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వేమంత్రిగా పనిచేసినప్పుడు 2005లో రాంచీ, పురీలో ఉన్న రెండు ఐఆర్‌సీటీసీ హోటళ్లను సుజాత హోటల్స్‌ అనే ప్రైవేటు కంపెనీకి అక్రమంగా కట్టబెట్టినట్లు సీబీఐ ఆరోపించింది. ఈ హోటల్ ప్రమోటర్లు లాలు కుటుంబానికి చాలా సన్నిహితులని పేర్కొంది. ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నట్టు సీబీఐ స్పష్టం చేసింది. లాలూ కుటుంబ సభ్యులతోపాటు రైల్వే అధికారులపైనా చార్జిషీటు దాఖలు చేసింది. 

మరోవైపు దాణా కుంభకోణంలో ఆర్జేడీ అధినేత గురువారం కోర్టులో లొంగిపోయారు. లాలూ కోర్టులో లొంగిపోయిన తర్వాత కుమారుడు తేజస్వీ యాదవ్, భార్య రబ్రీ దేవీలకు బెయిల్ లభించింది.