బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు. ఇటీవలే ఆయనకు సీబీఐ కోర్టు జైలు శిక్ష విధించింది. శిక్ష అనుభవిస్తున్న సమయంలోనే ఆరోగ్యం చెడిపోవడంతో రిమ్స్ కు తీసుకెళ్లారు. అక్కడ నుంచి ఇప్పుడు ఎయిమ్స్ తరలించారు.
న్యూఢిల్లీ : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ ఆరోగ్యం క్షీణించింది. ఆయనకు గుండె, కిడ్నీలో సమస్యలు ఉన్నాయని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) డైరెక్టర్ కామేశ్వర్ ప్రసాద్ మంగళవారం తెలిపారు. ప్రస్తుతం రాంచీలోని ప్రభుత్వ రిమ్స్‌లో చికిత్స పొందుతున్న ప్రసాద్‌ను మెరుగైన చికిత్స కోసం న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించారు.
“ లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితిని మెడికల్ బోర్డు సమీక్షించింది. ఆయనకు గుండె, కిడ్నీలో సమస్యలు ఉన్నట్లు తేలింది. మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలిస్తున్నారు.” అని రిమ్స్ డైరెక్టర్ చెప్పారు. 73 ఏళ్ల లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం పరిస్థితి తీవ్రంగా ఉందని, అయితే నిలకడగా ఉందని రిమ్స్ గత నెలలో తెలిపింది.
దాణా కుంభకోణంలో, డోరండా ట్రెజరీ నుండి 139 కోట్ల రూపాయలను అపహరించిన కేసులో ప్రముఖ రాజకీయ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి అయిన లాలూ ప్రసాద్ యాదవ్ కు ఇటీవల సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష, 60 లక్షల రూపాయల జరిమానాను విధించింది.
‘‘ అతని (లాలూ ప్రసాద్) బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెజర్ హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. చక్కెర స్థాయి ఉదయం 70 mg/dlగా నమోదైంది, అయితే మధ్యాహ్నం నాటికి 240 mg/dlకి చేరుకుంది. అతని సిస్టోలిక్ రక్తపోటు 130-160 మధ్య హెచ్చుతగ్గులకు లోనవుతోంది. అతని కిడ్నీ 20 శాతం కెపాసిటీతో పనిచేస్తోంది" అని ప్రసాద్‌ను చూసుకునేందుకు రిమ్స్ ఏర్పాటు చేసిన ఏడుగురు సభ్యుల వైద్యుల బృందానికి నేతృత్వం వహిస్తున్న విద్యాపతి పీటీఐతో తెలిపారు.
కోట్లాది రూపాయల దాణా కుంభకోణంలో, డోరాండా ట్రెజరీ అపహరణ కేసులో దోషిగా తేలిన తరువాత లాలూ ప్రసాద్ యాదవ్ ను బిర్సా ముండా సెంట్రల్ జైలుకు తరలించారు. అనంతరం అతని ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో రిమ్స్‌కు తీసుకెళ్లారు. గతేడాది జనవరిలో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కూడా చేరారు. దాణా కుంభకోణంలో నాలుగు కేసుల్లో ప్రమేయం ఉన్నందున గతంలో ప్రసాద్‌కు 14 ఏళ్ల జైలు శిక్ష పడింది.
